పెద్దశంకరంపేట, మే 12: పిడుగు పాటుకు ఇద్దరు మృతి చెందిన ఘటన పెద్దశంకరంపేట మండలం రామోజిపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాల్లోకి వెళితే పెద్దశంకరంపేట మండలంలోని రామోజిపల్లి గ్రామానికి చెందిన పాల్వంచ శ్రీరాములు (45) తనకున్న రెండెకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. అందులో పం డిన పంటను గ్రామంలో ఏర్పాటు చేసిన కొ నుగోలు కేంద్రంలో విక్రయించేందుకు కేం ద్రానికి తీసుకెళ్లాడు. తేమ శాతం ఎక్కువగా ఉండడంతో కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరబోశారు.
ఆదివారం ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం ఒక్కసారిగా భారీ గా రావడంతో టార్పాలిన్లు కప్పడానికి శ్రీరాములు అన్న బిడ్డ కొడుకు (మనుమడు) శివరాజ్ (13)ను వెంట బెట్టుకుని వెళ్లాడు. ధాన్యంపై టార్పాలిన్లు కప్పుతున్న సమయంలో పిడుగు పడడంతో ఇద్దరు మృతిచెందారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. శివరాజ్ పెద్దశంకరంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు.
తాతా మనుమడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఆర్ఐ శరణప్ప ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా చేశారు. ఇక్కడ ఎంపీపీ జంగం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ బాసాడ రాజు, నాయకులు సురేశ్‌గౌడ్, సాయిలు వచ్చి బాధిత కుటుంబీకులకు సంతాపం తెలిపారు. ప్రభుత్వం కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. పెద్దశంకరంపేట మండలం రామోజీపల్లిలో మృతిచెందిన రైతు కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన సహకారాన్ని అతి త్వరలో అందిస్తామని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.