గజ్వేల్, జనవరి 31: సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు బీఆర్ఎస్ హయాంలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనులకు టెండర్లు పిలిచామని, ఆ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని, పోరాడి ఎత్తిపోతలు పూర్తిచేయించుకుందామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పటేల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టిన పాదయాత్ర శుక్రవారం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రానికి చేరా రు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్ మాట్లాడారు. నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, అందోల్ ప్రాంతాలకు సాగునీళ్లు తేవాలని మల్లన్నసాగర్ నుంచి సింగూర్‌కు గోదావరి జలాలను లిఫ్ట్‌చేసి, అక్కడి నుంచి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా నీరందించి సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసుకోవాలనే లక్ష్యంతో పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. కాంగ్రెస్ సర్కారు రాగానే ఆ పనులు నిలివేసిందని విమర్శించారు. ప్రజలను సమీకరించి హరీశ్‌రావు నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం చేయాలని సూచించారు.
ఈ ఎత్తిపోతలు పూర్తయితే నారాయణ్‌ఖేడ్, జహీరాబాద్, అందోల్ నియోజకవర్గ రైతులకు మేలు జరుగుతుందని, జిల్లా మంత్రి ఏమి చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు. ప్రభుత్వం మెడలు వంచి ఎత్తిపోతలు పూర్తిచేసుకోవాలంటే పోరాటానికి సిద్ధం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. పోరాటాలు చేయాల్సిందేనని, కొట్లాడితే కాని ఈ ప్రభుత్వం దిగి రాదన్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని, తెలంగాణ రాష్ట్రం సాధించి, వచ్చిన తెలంగాణను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తే, ఈ దరిద్రులు వచ్చి నాశనం పట్టిస్తున్నారని, దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వంపై పోరాటాలకు అవసరమైన సందర్భంలో పార్టీ జిల్లాశాఖ పిలుపునిస్త్తదని, రాష్ట్రంలో తాను పిలుపునిస్తానని, అందులో అందరూ పాల్గొనాలని కేసీఆర్ కోరారు.
ఆనాడు తెలంగాణ రాష్ట్రం సాధిస్తే తప్పా ఈ గడ్డకు విముక్తి రాదని, ఈ రైతులు బాగుపడరని, ఆరునూరైనా తెలంగాణ తెచ్చుకోవాలనే నిర్ణయానికి వచ్చి గవర్నమెంట్ ఇంట్లో ఉండవద్దనే నిర్ణయంతో రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూమి అమ్మి బంజారాహిల్స్‌లో ఇల్లు కొంటే కొంత డబ్బు మిగిలిందని కేసీఆర్ గుర్తుచేశారు. ఆ డబ్బుతో జహీరాబాద్ ప్రాంతంలోని మొగుడంపల్లిలో అన్ని మామిడి తోటలు ఆంధ్రావాళ్లవి చూసిన తరువాత ఆరునూరైనా తెలంగాణ సాధించాలనే మొండిగా బలమైన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఆనాడు అక్కడ చూసిన వ్యవసాయభూములు ఆంధ్రా వాళ్ల చేతిలో ఉండడం చూసి మనవాళ్ల కోసం తెలంగాణ సాధించాలనే పోరాటం చేశానన్నారు. అప్పటి ప్రభుత్వాలు కరెం ట్ విషయంలో ఎంతో అవహేళనగా మాట్లాడాయని, టాన్స్‌ఫార్మర్లు కాలిపోవుడు, లం చాలు ఇచ్చుడు గుర్తు చేసుకుంటే కళ్లతో నీళ్లు వస్తాయని ఎంతో బాధపడ్డ్డామని కేసీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసినట్లు తెలిపారు.
రైతులు పరిస్థితిని చూసి రైతుబంధు, రైతుబీమాను తీసుకొస్తే అన్నదాతలు ఎంతో సంతోషపడ్డారన్నారు. కష్టకాలంలో రైతుల కోసం నాలుగైదు సంక్షేమ పథకాలను తెచ్చి అమలు చేసినట్లు గుర్తుచేశారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీళ్లు అందించామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలోనే వ్యవసాయ భూముల ధరలు సగానికి సగం పడిపోయాయని, రైతుల పరిస్థితి ఆగమైందని కేసీఆర్ అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తన్నీరు హరీశ్‌రావు, మాణిక్‌రావు, చింతా ప్రభాకర్, సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, నాయకులు చంద్రాగౌడ్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మేదపల్లికి చెందిన పరమేశ్వర పాటిల్ ఆధ్వర్యంలో సోమవారం ప్రారంభమైన పాదయాత్ర వందమందితో శుక్రవారం మధ్యాహ్నం మర్కూక్ మండలం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రానికి చేరుకుంది. ఐదు రోజుల పాటు 140 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రకు ఆయా గ్రామాల ప్రజలకు ఘనస్వాగతం పలికారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రజలకు ఎలాంటి లాభం చేకూరలేదని పాదయాత్ర బృందానికి ప్రజలు తెలిపారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి వేలాది కార్యకర్తలు వ్యవసాయక్షేత్రానికి తరలివచ్చారు. ఎంతో ఆప్యాయంగా అందరినీ పలకలించి కేసీఆర్ వారితో ఫొటోలు దిగారు. అక్కడికి వచ్చిన కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ఝరాసంగం మండలానికి చెందిన కేసీఆర్ అభిమాని దిగంబర్ కేసీఆర్‌కు చిత్రపటాన్ని అందజేశారు.
ఐదు రోజులుగా కొనసాగిన పాదయాత్రలో ప్రజలు మాదృష్టికి తెచ్చిన సమస్యలను కేసీఆర్‌కు వివరించాం. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు పడతున్న ఇబ్బందులు, గ్రామాల్లోని పరిస్థితిని తెలియజేశాం. తెలంగాణ ప్రదాత కేసీఆర్‌ను దగ్గరగా కలవడంతో ఎంతో సంతృప్తిగా ఉంది. కేసీఆర్ పాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉండేవారు.
– పరమేశ్వర పటేల్, మాజీ సర్పంచ్
ఉద్యమకాలం నుంచి కేసీఆర్‌తోనే ఉన్నా. ఆయనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైంది. నా 30 ఏండ్ల రాజకీ య జీవితంలో ఇలాంటి దౌర్భాగ్య కాంగ్రెస్ ప్రభుత్వా న్ని ఎప్పుడూ చూడలేదు. ప్రజా సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యా రు. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తే బాగుంటుంది.
– చంద్రప్ప, మాజీ సర్పంచ్