మద్దూరు(ధూళిమిట్ట), ఆగస్టు 22: సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్ రిజర్వాయర్‌ను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు శనివారం సందర్శించారు. టీమ్ సభ్యులు విజయ్ దేశాయి, శ్రీకాంత్, కృష్ణయ్య రిజర్వాయర్ నాణ్యతా ప్రమాణాలు, భద్రతను పరిశీలించారు. రిజర్వాయర్ కట్టకు రెండుచోట్ల బుంగలు పడి నీరు వృథాగా పోతున్నట్లు అధికారులు గుర్తించారు. అసంపూర్తిగా రిజర్వాయర్ పనులు మిగిలిపోయినట్లు గుర్తించి అసహనం వ్యక్తం చేశారు. రిజర్వాయర్ లోపలి భాగంలో పంటలు సాగు చేయరాదని గ్రామస్తులకు సూచించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్ ప్రస్తుత పరిస్థితి గురించి గ్రామ సర్పంచ్ కాసర్ల రేణుకాకనకరాజు ప్రత్యేకంగా వివరించారు.
రిజర్వాయర్ కట్టకు బుంగలు పడి నీరంతా రోడ్డుపైకి చేరుతుండడంతో బీటీ రోడ్డు పూర్తిగా దెబ్బతింటున్నట్లు తెలిపారు. సాగుభూముల్లోకి నీరు వెళ్లడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు. కట్టపై పెరిగిన ముళ్లపొదలతో కట్టకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న రిజర్వాయర్, కాల్వల నిర్మాణ పనులను పూర్తి చేయాలని సర్పంచ్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో గోదావరి జలాలతో రిజర్వాయర్ నింపి రైతులకు సాగునీరు అందించాలని సర్పంచ్ అధికారులను కోరారు. పరిశీలించిన అంశాలు, సర్పంచ్ తమ దృష్టికి తీసుకువచ్చిన విషయాలను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ)కి నివేదించనున్నట్లు వారు తెలిపారు. వారివెంట దేవాదుల రిజర్వాయర్ డీఈ రుద్ర, ఏఈ వెంకటేశ్‌తో పాటు పలువురు అధికారులు, గ్రామస్తులు ఉన్నారు.