జహీరాబాద్, మార్చి 17 : సంగమేశ్వర్ ఎత్తిపోతల పథకం పనులు వేగంగా పూర్తిచేసి జహీరాబాద్ ప్రాంత రైతులకు సాగు నీరందించేలా చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆసెంబ్లీలో ఆయన ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారు. జహీరాబాద్ ప్రాంతంలో నదులు, పెద్ద చెరువులు లేవన్నారు. కేవలం వర్షాధారంపైనే నమ్ముకుని నియోజకవర్గంలోని రైతులు వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు.
పంటలకు సాగునీరు అందించేందుకు నియోజకవర్గంలో రైతులు పొలాల్లో వేయి ఫీట్ల వరకు బోర్లు డ్రిల్లింగ్ చేసినా నీరు రాక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌కు రూపకల్పన చేసినట్లు గుర్తుచేశారు. దీనిద్వారా 622 మీటర్ల ఎత్తులో ఉన్న జహీరాబాద్ నియోజకవర్గంలోని రైతులకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించేందుకు పథకానికి భూమిపూజ చేసినట్లు తెలిపారు.
జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి మండలాల పరిధిలోని 115 గ్రామాల్లో 1,03,259 ఎకరాలకు సాగు నీరందించేందుకు ఈ పథకం పనులు మొదలు పెట్టినట్లు తెలిపారు. మునిపల్లి మండలంలోని చిన్నచల్మెడలో పంపుహౌస్ కోసం అప్పటి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు భూమిపూజ చేశారన్నారు. జహీరాబాద్ ప్రాంత రైతులు వాణిజ్య పంటలు ఎక్కువగా సాగుచేస్తారని , ఈ పంటలకు నీరు ఎక్కువగా అవసరం ఉంటుందన్నారు. ఈ ఎత్తిపోతల పథకం త్వరగా పూర్తిచేసి సాగురందిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు.