జగదేవ్‌పూర్, జనవరి 24: మండలంలోని తీగుల్ నర్సాపూర్ కొండపోచమ్మ ఆలయం మంగళవారం భక్తులతో జనసంద్రంగా కనిపించింది. జాతర రెండోరోజు అమ్మవారిని దర్శించుకునేందుకు 50 వేల సంఖ్యలో భక్తులు వచ్చారని ఆలయ వర్గాలు తెలిపాయి. కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న భక్తులు సోమవారం సాయంత్రం నుంచి పెద్ద సంఖ్యలో కొండపోచమ్మ వద్దకు చేరుకున్నారు.
జంట నగరాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో డీజేలు ఏర్పాటు చేసి అమ్మవారి తొట్టెలు, ఘటాలను అందంగా అలంకరించి ధూంధాంగా సందడి చేస్తూ ముడుపులు కట్టారు. జోగినులు ఎత్తైన బోనాలు ఎత్తుకొని నృత్యాలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా పలు ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ రజితా రమేశ్, ఈవో మోహన్‌రెడ్డి తెలిపారు. ఎస్సై కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు కొనసాగింది.