చేర్యాల, ఆగస్టు 4: రాష్ట్రంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, డైరెక్టర్ల పదవులకు తీవ్ర పోటీ నెలకొంది. యాదవ సామాజిక వర్గం ఆరాధ్య దైవమైన కొమురవెల్లి మల్లన్న ఆలయ పాలక మండలి చైర్మన్ పదవిని అదే సామాజిక వర్గానికి కేటాయించాలని దేవాలయ చరిత్రలో ఎన్న డూ లేనివిధంగా ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య ప్రస్తావించారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ అంజన్‌కుమార్, ఆయన కుమారుడు రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్ సైతం కొమురవెల్లి ఆలయ చైర్మన్ పదవిని తమ సామాజిక వర్గానికి ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఆలయ చైర్మన్ పదవి విషయం ప్రస్తావించడంతో అనాధిగా వస్తున్న సంప్రదాయం మేరకు నియోజకవర్గానికి చెందిన నాయకుడికి పదవి దక్కుతుందా లేక రాష్ట్రస్థ్ధాయి నేతలు అనుకున్న వారికి దక్కుతుందా అనే మీమాంసలో అధికార పార్టీ శ్రేణులు ఉన్నారు. నియోజకవర్గానికి చెందిన డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డికి మల్లన్న ఆలయ పాలక మండలి చైర్మన్ పదవి ఎంపిక విషయంలో తలమునకలై ఉన్నారు.
జనగామ నియోజకవర్గంలోని కొమురవెల్లి మల్లన్న ఆలయ చైర్మన్ పదవితోపాటు డైరెక్టర్ల పదవులు సైతం అధికార పార్టీకి చెందిన వారికి రావడం ఆనవాయితీగా వస్తున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం నాటి సర్కారు చైర్మన్‌తో పాటు కమిటీలో సభ్యులను నియోజకవర్గానికి చెందిన నాయకులకే ఎక్కువగా కేటాయించి, హైదరాబాద్‌కు చెందిన కొందరు దాతలకు అవకాశం కల్పించింది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం మొదటిసారిగా ధర్మకర్తల మండలి కాకుండా ఉత్సవాలు విజయవంతంగా కొనసాగించేందుకు ఫెస్టివల్ కమిటీ ఏర్పాటు చేసింది. అందులో నియోజకవర్గంలోని నాయకులు ఎక్కువగా, ఇతరులకు తక్కువ ప్రాధన్యత ఇచ్చింది.
కానీ, అనాధిగా వస్తున్న సంప్రదాయం మేరకు నియోజకవర్గానికి చెందిన నాయకులకు చైర్మన్ పదవి ఇవ్వాల్సి వస్తుంది. చైర్మన్ పదవి అసెంబ్లీలో ప్రస్తావనకు రావడం తమ వారికే కావాలని రాజ్యసభ సభ్యుడు, ప్రభుత్వ విప్‌తో పాటు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ పావులు కదుపుతుండడంతో ఈసారి స్థ్ధానికులకు అవకాశాలు ‘చే’జారే అవకాశం కనిపిస్తున్నది. గతంలో ఉన్న సంప్రదాయాన్ని కొనసాగించాలంటే నిబంధనల మేరకు దేవాదాయ శాఖ నోటిఫికేషన్ జారీచేసిన సమయంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, దరఖాస్తులను పరిశీలిస్తే గొల్లకురుమ సామాజికవర్గానికి చెందిన నాయకులు ఒకరిద్దరు మినహా ఎక్కువగా దరఖాస్తు చేసుకోలేదని సమాచారం.
పాలక మండలిలో చోటుకోసం జనగామ నియోజకవర్గంలోని 8 మం డలాల నుంచి 22 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. రాష్ర్టవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి మరో 60మంది దరఖాస్తులు సమర్పించారు. మంత్రి పొన్నం, ఎంపీ అనిల్‌కుమార్, జహీరాబాద్ ఎంపీ సురేశ్‌షెట్కార్, మేడ్చల్ కాంగ్రెస్ నేత వజ్రేశ్‌యాదవ్, జూబ్లీహిల్స్ యూత్ కాంగ్రెస్ నేతతోపాటు నియోజకవర్గానికి చెందిన పర్పాటకం లక్ష్మారెడ్డి, గంగం నర్సింహారెడ్డి, కొప్పురపు జయప్రకాశ్‌రెడ్డి చైర్మన్ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
ఓ వైపు గొల్లకురుమ సామాజికవర్గం, మరోవైపు చైర్మన్ పదవి ఎంపిక విషయంలో నియోజకవర్గ ఇన్చార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఎవరి వైపు మొగ్గు చూపుతారో అనే ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు, నామినేటెడ్ పదవుల కేటాయింపుపై సీఎం రేవంత్‌రెడ్డిని కొమ్మూరి శుక్రవారం అసెంబ్లీలో కలిసి విజ్ఞప్తి చేశా రు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో వచ్చే బ్రహ్మోత్సవాలకు ఫెస్టివల్ కమిటీ ఏర్పాటు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.