గజ్వేల్, డిసెంబర్ 27: గజ్వేల్ ప్రాంతంలోని అడవులు చాలా అద్భుతంగా ఉన్నాయంటూ అటవీశాఖ ట్రైనీ ఎఫ్ఆర్వోల బృందం కితాబిచ్చింది. గజ్వేల్ నియోజకవర్గంలోని సంగాపూర్, సింగాయపల్లి అటవీ ప్రాంతాలు, గజ్వేల్ అర్బన్ పార్కును కర్ణాటకలోని అటవీ కళాశాలలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఎఫ్ఆర్వోలు మంగళవారం సందర్శించారు. ముందుగా ట్రైనీ అధికారుల బృందం సింగాయపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించింది. డీఎఫ్‌వో శ్రీనివాస్, ఎఫ్ఆర్వో కిరణ్‌కుమార్ సింగాయపల్లిలో అడవుల అభివృద్ధికి చేపట్టిన చర్యలు, అడవిలో పెరుగుతున్న వివిధ జాతుల చెట్ల గురించి వివరించారు.
ట్రైనీ అధికారుల బృందంలో అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ర్టాలకు చెందిన వారు ఉండగా, ఇక్కడి అడవుల్లో పెంచుతున్న మొక్కల గురించి ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంగాపూర్ అటవీ ప్రాంతానికి చేరుకున్న ట్రైనీ అధికారుల బృందం పునరుత్పత్తిలో భాగంగా నాటి అభివృద్ధి చేసిన అడవిని పరిశీలించారు. ఎఫ్ఆర్వో కిరణ్ అడవిలో నాటిన వివిధ మొక్కలు, వాటి అభివృద్ధికి తీసుకున్న చర్యల గురించి వివరించారు. అనంతరం అర్బన్ పార్కును ట్రైనీ అధికారులు సందర్శించారు. కాగా సింగాయపల్లి అడవిలో సీతాఫలం వృక్షాలను చూసిన అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన ట్రైనీ అధికారులు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సీతాఫలం చెట్ల ఆకులను సేకరించారు.