
గజ్వేల్, జనవరి 10 : నాడు వ్యవసాయం దండుగ అన్న పరిస్థితుల నుంచి నేడు వ్యవసాయం అంటే పండుగ అనేలా సీఎం కేసీఆర్ రైతుల అభివృద్ధికి కృషి చేశారని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్‌లో ట్రాక్టర్లు, ఎడ్లబండ్లతో ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో రైతుబంధు ర్యాలీ నిర్వహించారు. గజ్వేల్ కోటమైసమ్మ ఆలయం, రైతువేదిక నుంచి ఇందిరాపార్కు మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో వ్యవసాయం అంటేనే దండుగా అనేలా పరిస్థితి ఉండేదన్నన్నారు. కానీ, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు వ్యవసాయం పండుగలా చేయొచ్చని నిరూపించాయన్నారు. రూ.50 వేల కోట్లు రైతుబంధు నిధులను రైతు ఖాతాల్లో జమ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. సీఎం కేసీఆర్ లాంటి గొప్ప నాయకుడు దేశంలో ఎక్కడా లేరన్నారు. రైతుబంధు పథకం ప్రారంభమైనప్పటి నుంచి తెలంగాణలో సాగు విస్తీర్ణం రెట్టింపైందన్నారు. వలస వెళ్లిన రైతులు తిరిగి స్వగ్రామాలకు చేరుకుని సంతోషంగా వ్యవసాయం చేస్తున్నారని తెలిపారు. ఇతర రాష్ర్టాల రైతులు, నాయకులు సైతం రైతుబంధు పథకాన్ని మెచ్చుకుంటున్నారని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్‌లు రైతులను ఎప్పుడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ రైతులకు అండగా ఉంటూ పంటకు పెట్టుబడి సాయం అందజేస్తున్న సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు అని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపీపీ దాసరి అమరావతి, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయొద్దీన్, వైస్ ఎంపీపీ కృష్ణగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ చిన్నమల్లయ్య, జడ్పీటీసీ పంగమల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశంగౌడ్, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, సీనియర్ నాయకులు మాదాసు శ్రీనివాస్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు చంద్రమోహన్, రైతుబంధు కో-ఆర్డినేటర్ మద్ది రాజిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నవాజ్‌మీరా, కౌన్సిలర్లు గోపాల్‌రెడ్డి, బాలమణి శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మీకిషన్రెడ్డి, బబ్బూరి రజిత, బొగ్గుల చందు, రహీం, అత్తెల్లి శ్రీనివాస్, శ్యామల మల్లేశం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అంబరాన్నంటిన రైతుబంధు సంబురాలు..
గజ్వేల్‌లో నిర్వహించిన రైతుబంధు సంబురాలు సం క్రాంతి, ఉగాది పండుగలను తలపించాయి. వందకుపైగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లకు పువ్వులు, మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో అందంగా ముస్తాబు చేసి రైతులు ర్యా లీకి తరలివచ్చారు. కోటమైసమ్మకు ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి కొబ్బరికాయ కొట్టి ముందుకు సాగగా, ఎడ్లబండ్ల ర్యాలీని గుమ్మడికాయ కొట్టి ప్రారంభించారు. రైతువేదిక, ఎంపీపీ కార్యాలయం, ఇందిరాపార్కు మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. పచ్చటి తోరణాలు, పువ్వులతో ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు ఊరేగింపుగా పట్టణమంతా తిరగడంతో సంక్రాంతి వేడుకలు గుర్తుకొచ్చాయి.