జహీరాబాద్, డిసెంబర్ 16: మెతుకుసీమ చలితో వణుకుతుంది. రోజురోజుకూ ఉమ్మడి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, కోహీర్, న్యాల్కల్ మండలాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆయా మండలాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. జహీరాబాద్ మండలంలోని సత్వార్‌లో 6.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కోహీర్, న్యాల్కల్లో 6.7 జహీరాబాద్‌లో 6.9, కోహీర్‌లోని దిబ్బలో 7.0, జహీరాబాద్ మండలంలోని ఆల్గోలో 7.2, మల్చేల్మాలో 7.3, మొగుడంపల్లిలో 7.9, ఝరాసంగంలో 8.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు కాగా, రాష్ట్రంలో సత్వార్ 8వ స్థానం, కోహీర్ పదో స్థానం, న్యాల్కల్ 12వ స్థానంలో నిలిచాయి.
చలి తీవ్రతతో ఆయా మండలాలు, పట్టణ వాసులు ఉదయం వేళల్లో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. చలి తీవ్రతతోపాటు పొగమంచు దట్టంగా ఉంటే తెల్లవారు జాము ప్రయాణాలు పెట్టుకోవద్దని, అత్యవసరంగా వెళ్లాల్సి వస్తే వాహనాలు జాగ్రత్తగా నడుపుకోవాలని సూచిస్తున్నారు. చలి నుంచి కాపాడుకునేందుకు వెచ్చటి దస్తులు ధరించాలని, స్వెటర్లు, మప్లర్లు వంటివి వాడాలంటున్నారు. చన్నీటి స్నానానికి దూరంగా ఉండాలని, శ్వాస వ్యవస్థ మీద ప్రభావం చూపించే పానియాలు, ఐస్‌క్రీమ్ వంటి వాటికి దూరంగా ఉంటే మంచిదంటున్నారు.
వృద్ధులు, పిల్లలు, బాలింతలు, గర్భిణులు ఎక్కువగా ప్రభావితం అవుతారని, శ్వాసకోస సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రతగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంపైనే చలి ప్రభావం రోజురోజుకూ ఎక్కువగా అవుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రాంతం సముద్ర మట్టానికి 640 మీటర్ల ఎత్తులో ఉండడం వల్ల చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.
నియోజవర్గంలోని న్యాల్కల్, కోహీర్, ఝరాసంగం, మొగుడంపల్లి మండలాల్లో మంజీరాతోపాటు నారింజ ప్రాజెక్టు, గోడిగార్పల్లి, ఈదులపల్లి, ఏడుకులపల్లి, చినిగేపల్లి, హద్నూర్, డప్పూర్ గ్రామాల శివారు ప్రాంతంలో చెరువులు, కుంటలు, బోరుబావులు ఉండడంతోపాటు పచ్చని చెట్లు, పంట పొలాల వల్ల చలి తీవ్రత ఎక్కవగా ఉంటుందన్నారు. చలి తీవ్రత ఎక్కవ ఉండడం వల్ల యాసంగి సీజన్లో సాగు చేసే పంటలకు ఎంతో మేలు జరుగుతుందని న్యాల్కల్ మండలం బసంతపూర్ ప్రొఫెసర్ జయశంకర్ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ్‌కుమార్ పేర్కొన్నారు. పొగమంచు కురవడంతో కంది పూత రాలిపోయే ప్రమాదం ఉందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
చిన్నశంకరంపేట, డిసెంబర్ 16: చిన్నశంకరంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం ఉదయం పొగమంచు కప్పేసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 7.30గంటలకు సైతం లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.