జహీరాబాద్, జనవరి 26: సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటి వదిలి పెడుతున్నారు. దీంతో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో మంజీరా నదిలో సింగూరు బ్యాక్ వాటర్ మట్టం వేగంగా తగ్గుతున్నది. తద్వారా వేసవిలో జహీరాబాద్ నియోజకవర్గంలో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. సమైక్య పాలనలో ఎండాకాలం వచ్చిందంటే జహీరాబాద్ నియోజకవర్గంలో తాగునీటికి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించి, ఇంటింటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందించింది. దీనికోసం మంజీరా నదితో పాటు సింగూర్ ప్రాజెక్టు ద్వారా ఏటా 3.2 టీఎంసీల జలాలు వినియోగిస్తున్నది. జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్ పట్టణంతో పాటు న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్, జహీరాబాద్, మొగుడండల్లి మండలాల పరిధిలోని 173 గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీటి పథకం కింద తాగునీటిని సరఫరా చేస్తున్నది.
దీనికోసం న్యాల్కల్ మండలం రాఘవపూర్, మునిపల్లి మండలంలోని బుసారెడ్డిపల్లి గ్రామాల శివారులోని మిషన్ భగీరథ పథకం ఫిల్టర్బెడ్లు ఏర్పాటు చేసింది. ఇక్కడ ప్రతిరోజు దాదాపు 98 ఎంఎల్డీ నీటిని శుద్ధిచేసి మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ నీటిని సరఫరా చేస్తున్నది. ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టుకు మరమ్మతుల దృష్ట్యా అధికారులు నీటిని దిగువకు వదులుతున్నది. మంజీరానదిలో నీటిమట్టం తగ్గుతుండటంతో తాగునీటి సరఫరాకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.
ఫిబ్రవరి, మార్చి నాటికి మంజీరా నదిలో నీటిమట్టం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. వేసవిలో తాగునీటి సమస్య తలెత్త అవకాశం ఉంటుందని, సంబంధిత అధికారులు మండలాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముందు జాగ్రత్తల గురించి ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులకు వివరిస్తున్నారు. దీనికోసం జహీరాబాద్ నియోజకవర్గంలో గ్రామాల వారీగా ఫిబ్రవరి 1 నుంచి 20 వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాలపైనే ఆధారపడాల్సి ఉంటుందని, ప్రజలు తాగునీటిని పొదుపుగా వాడుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.