సిద్దిపేట, ఏప్రిల్ 27: బీఆర్ఎస్ అంటే తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవ ప్రతీక, బీఆర్ఎస్ అంటే తెలంగాణ బానిస సంకెళ్లను తెంపి మనకు స్వేచ్ఛా స్వాతంత్య్రాన్ని తెచ్చిన పార్టీ అని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట హౌసింగ్ బోర్డు కమాన్ వద్ద పార్టీ జెండాను బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డితో కలిసి ఆవిషరించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సిద్దిపేటలో 24 ఏండ్ల క్రితం పుట్టిన ఈ పార్టీ, తెలంగాణ కోసం పోరాటం చేసిందన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పిందన్నారు.
సమైక్య పాలకుల అణచివేత నుంచి స్వాతంత్య్రం కల్పించిన పార్టీ అన్నారు. చావు నోట్లో తలపెట్టి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని, తెలంగాణ రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ లేకుండా తెలంగాణను ఊహించలేమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి, ఆదాయం కుంటుపడిందన్నారు. హామీలు ఎగ్గొట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటుందని,సిద్దిపేట అంటే ప్రభుత్వము ఓర్వలేని పరిస్థితి ఉందన్నారు.
అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజల పక్షమే అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామని తెలిపారు. సిద్దిపేటకు మంజూరైన అభివృద్ధి పనులు, నిధులు కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్ తరలించుకు పోయిందని విమర్శించారు. గులాబీ పార్టీ పుట్టినరోజును రాష్ట్రమంతా ఘనంగా జరుపుకుంటున్నదని, రాష్ట్ర ప్రజలందరికీ, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, తెలంగాణ ఉద్యమకారులకు, బీఆర్ఎస్ అభిమానులకు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, కొండం కవిత, అనగోని వినోద్, అరవింద్‌రెడ్డి పాల్గొన్నారు.
దుబ్బాక, ఏప్రిల్ 27: తెలంగాణలో మళ్లీ కేసీఆర్ సారే ముఖ్యమంత్రిగా ఉండాలని, ఆయనతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ప్రజలంతా అనుకుంటున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాక పట్టణంలో బీఆర్ఎస్ జెండాను ఆయన విష్కరించారు. దుబ్బాక మండలం పెద్దగుండావెళ్లి, తిమ్మాపూర్ గ్రామాల్లోనూ జెండావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇంతింతై వటుడింతై అన్నట్లుగా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు కేసీఆర్ ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ నేడు మహా వృక్షంగా మారి తెలంగాణకు అండగా నిలిచిందన్నారు. కాంగ్రెస్ 15 నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ఆరుగ్యారెంటీలు, హామీలు, ప్రజా సంక్షేమాన్ని ప్రభు త్వం విస్మరించిందన్నారు. కార్యక్రమాల్లో రొట్టే రాజమౌళి, ఎల్లారెడ్డి, కైలాష్, రవీందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, వంశీ, శ్రీనివాస్, భూంరెడ్డి, యాదగిరి, స్వామి పాల్గొన్నారు.
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 27: తెలంగాణ ఉద్యమం దేశానికే ఆదర్శంగా నిలిచించిదని, ప్రజాస్వామ్య విధానంలో శాంతియుతంగా పోరాటం చేసి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ 25వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని ఆదివారం మెదక్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో జడ్పీ మాజీ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్లు మల్లికార్జున్‌గౌడ్, బట్టి జగపతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ మామిళ్ల అంజనేయలు, కో కన్వీనర్లు గడ్డమీది కృష్ణాగౌడ్, లింగారెడ్డి, జుబేర్ తదితరులతో కలిసి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుట్రలు, ప్రలోభాలతో తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని ఆనాటి కాంగ్రెస్ చూసిందన్నారు. అన్నిటిని తట్టుకుని కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించారని, సాధించిన రాష్ర్టాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపినట్లు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు జయరాజ్, చంద్రకళ, కిశోర్, శ్రీనివాస్, సాధిక్, మధు, సోములు, చింతల నర్సింలు, జగదీశ్, గట్టేశ్, నగేశ్, అంజాగౌడ్, మేడిశెట్టి శంకర్, మోచి కిషన్, గోపాలకృష్ణ, కిష్టయ్య, గట్టేశ్, ఫాజిల్, శ్రీనివాస్‌గౌడ్, సున్నం నరేశ్, రంజిత్, అరుణ్, కిరణ్, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గ్గొన్నారు.