సిద్దిపేట, మార్చి 20: ఈద్-ఉల్-ఫితర్ (పవిత్ర రంజాన్) పర్వదినం సందర్భంగా ముస్లిములకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ గొప్ప మాసంలో కఠోర ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకొనే అతిపెద్ద గొప్ప పండుగల్లో ఒకటి రంజాన్ అని కొనియాడారు. చెడు భావనలను, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని, ఈ పవిత్ర మాసం ఉపవాసదీక్షలు, ప్రేమ, దయ, సౌభ్రాతృత్వ గుణాలను పంచుతుందని తెలిపారు.
గంగా జమునా తెహజీబ్‌కు తెలంగాణ ప్రతీక అని పేర్కొన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, అల్లా దయతో రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు హరీశ్‌రావు తెలిపారు.. కుల మతాలకతీతంగా ఒకరి పండుగలను మరొకరు సోదరాభావంతో కలిసి మెలిసి జరుపుకొనే గొప్ప సంసృతి మన తెలంగాణ వారిదని కొనియాడారు. ముస్లింలు చేసే ప్రార్థనలు సఫలం కావాలని, అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు సకల శుభాలు కలగాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు.