సిద్దిపేట, ఫిబ్రవరి 20: “సిద్దిపేట యువతకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందించాలనే లక్ష్యంతో ‘హరీశ్ అన్న ఉద్యోగ యాప్’ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది.. యాప్‌ని ప్రారంభిస్తున్న సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చరిత్ర ఉంది. ఇకడ కేసీఆర్ చదువుకున్నారు. ఒక రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిని అందించిన కాలేజ్. ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అందించిన కాలేజ్ ఇది. యాప్ కాదు ఇది.. మీ జీవితాలు మార్చే రూట్ మ్యాప్” అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం ‘హరీశ్ అన్న ఉద్యోగ యాప్’ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఏ యాప్ వెతికినా ముందు ఫ్రీ అంటారు ఆ తర్వాత రూ. 500 కట్టమంటారని విద్యార్థులు చెప్పారన్నారు.
ఏ పని చేసినా దాంట్లో మంచి ఫలితాలు వచ్చినప్పుడే సంతృప్తి కలుగుతుందన్నారు. న్యాక్‌లో సిద్దిపేట డిగ్రీ కాలేజీకి ఏగ్రేడ్ రావడానికి సిబ్బంది, ప్రిన్సిపాల్ చాలా కృషి చేశారన్నారు. కాలేజీ అభివృద్ధికి నందిని సిధారెడ్డి, చుకా రామయ్య పనిచేశారన్నారు. డిగ్రీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు 95 శాతం జాబ్ చేస్తామని, 5 శాతం మాత్రమే వ్యాపారం చేస్తామని చేతులెత్తారన్నారు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో వ్యాపారం చేయడానికి 95 శాతం మంది ముందుంటారన్నారు. ఉద్యోగం చేస్తాను కాదు, ఉద్యోగం ఇస్తాను అనే ఆలోచనతో మీరందరూ ముందుకు వెళ్లాలన్నారు. సిద్దిపేట అన్ని రంగాల్లో ముందుండాలని నాలుగు పాలిటెక్నిక్ కాలేజీలు, ఒక గవర్నమెంట్ ఐటీఐ, మెడికల్ కాలేజ్ తెచ్చానన్నారు.
మెడికల్ కాలేజ్ సిద్దిపేటకు రావాలనేది ఒక కల. అలాంటి కలను మనం నెరవేర్చుకున్నామన్నారు. రెండు మెడికల్ కాలేజీలు, రెండు నర్సింగ్ కాలేజీలు, రెండు పారామెడికల్ కాలేజీలు, బీఫార్మసీ కాలేజ్, బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ ఇలా అన్ని విద్యాలయాలు సిద్దిపేటలో ఉన్నాయన్నారు. విద్యాపరంగా చాలా అభివృద్ధి చెందాం, ఇంకా అభివృద్ధి చెందుతాం.. అది నా బాధ్యత అన్నారు. నాట్ ఇనిస్టిట్యూట్, సెట్విన్ ఇనిస్టిట్యూట్‌ని కూడా సిద్దిపేటలో ఏర్పాటు చేశామన్నారు. సిద్దిపేటలో ఐటీ టవర్ ఏర్పాటు చేసి ఇకడి యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. సిద్దిపేట ఐటీ టవర్‌లో ఇంకా కొత్త కంపెనీలు కూడా వస్తున్నాయన్నారు. ఇకడి యువతకు మరిన్ని అవకాశాలు దకుతాయి, ఎకువ మంది యువతులే ఉద్యోగం చేయడం సంతోషం కలిగించిన విషయమన్నారు.
సిద్దిపేట ఒక ఎడ్యుకేషనల్ హబ్, రిజర్వాయర్లకు కూడా సిద్దిపేటనే హబ్, ఆలయాలకు కూడా సిద్దిపేట నిలయమన్నారు. పెద్ద పెద్ద నగరాలకు కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు కానీ సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉందన్నారు. సిద్దిపేట అంటే మోడల్ టౌన్‌గా అభివృద్ధి చేసుకున్నామన్నారు. రైతుల కోసం గోదావరి నీళ్లు తెస్తే సిద్దిపేటలో లక్ష ఎకరాల్లో పంట పండుతుందన్నారు. సంవత్సరం కష్టపడి చదివి ఉద్యోగం సాధిస్తే జీవితమే మారిపోతుందన్నారు. సిద్దిపేటలో రామచంద్రం అనే టైలర్‌కు నలుగురు ఆడబిడ్డలు, అందరూ గవర్నమెంట్ సూల్లో చదువుకొని మెడికల్ సీటుసాధించి ఈరోజు డాక్టర్ చదువుతున్నారన్నారు.
ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్నా… ఇంకో ఇద్దరు పిల్లల్ని డాక్టర్ చదివించడానికి శక్తిలేదని రామచంద్రం వచ్చినప్పుడు ఆ పిల్లల్ని చదివించే బాధ్యత నేను తీసుకున్నానని గుర్తు చేశారు. జహీరాబాద్ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకులాలను ప్రారంభించడానికి వెళ్లినప్పుడు అందులో ఒక అమ్మాయి డాక్టర్ అవుతానని చెప్పింది. ఈరోజు ఆ అమ్మాయి డాక్టర్ అయ్యిందన్నారు. జహీరాబాద్‌లో ఆటోడ్రైవర్ కూతురు గవర్నమెంట్ పాఠశాలలో చదువుకొని ఎంబీబీఎస్ సీటు సాధించిందన్నారు. యాప్‌ని సద్వినియోగం చేసుకొని జీవితంలో పైకి రావాలని, గవర్నమెంట్ ఉద్యోగాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.