అందోల్, ఆగస్టు 12: సంగారెడ్డి జిల్లా జోగిపేట సీఐ కార్యాలయంలో గన్ మిస్‌ఫైర్ కావడంతో తృటిలో ప్రమాదం తప్పింది. జోగిపేట సీఐ అనిల్‌కుమార్ మంగళవారం జోగిపేట ఠాణాలోని తన గదిలో రివాల్వర్ శుభ్రం చేస్తుండగా అనుకోకుండా పేలింది. దీంతో ఒక్కసారిగా సిబ్బందితో పాటు కార్యాలయం వద్ద ఉన్న జనం ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. మంగళవారం హైదరాబాద్‌లోని చందానగర్‌లోని ఓ జ్యువెలరీలో చోరీ జరిగింది.
జ్యువెలరీలో చోరీచేసిన నిందితులు జహీరాబాద్ వైపు వెళ్లినట్లు పోపస్ ఉన్నతాధికారులు సంగారెడ్డి జిల్లా పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో జోగిపేట సీఐ అన్ని ఠాణాల సిబ్బందిని అప్రమత్తంచేశారు. సరిహద్దు బార్డర్ చెక్‌పోస్టుల వద్ద పోలీసులు తనిఖీలు చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా అన్ని ఠాణాల సిబ్బంది తమ ఆయుధాలను సరిచూ సుకోవాలని చెప్పి సీఐ సైతం తగిన జాగ్రత్తలతో ఆయన గన్ శుభ్రం చేసుండగా రివాల్వర్ ట్రిగర్కు చేయి తగిలి ఓ హెడ్ కానిస్టేబుల్ పక్కన నుంచే బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు ఎవరూ స్పందించలేదు.