సంగారెడ్డి కలెక్టరేట్/ మెదక్ మున్సిపాలిటీ, జూన్ 30 : సంగారెడ్డి జిల్లాలో గ్రూప్-4 పరీక్షను పకడ్బందీగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. జూలై 1న మొదటి పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యా హ్నం 12:30 గంటల వరకు, రెండో పరీక్ష మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగనున్నది. సంగారెడ్డి జిల్లాలో 101 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 33,456 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. లైజనింగ్ అధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్ష కేంద్రాలను ముందస్తుగా సందర్శించి తాగునీరు, విద్యుత్, సీటింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, మౌలిక వసతులను పరిశీలించారు. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని, 144 సెక్షన్ అమలు చేయాలని కలెక్టర్ శరత్ ఆదేశించారు. పరీ క్ష కేంద్రంలో వైద్యసదుపాయం అందుబాటులో ఉంచాలని, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. పరీక్షకు 15 నిమిషాల ముందుగా పరీక్ష కేంద్రం గేట్ మూసివేయనున్నారు. ఉదయం 8 నుంచి 9:45 గంటలకు, మధ్యా హ్నం ఒంటి గంట నుంచి 2:15 గంటల వరకు అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. పరీక్ష కేంద్రం గేటు మూసివేసిన తర్వాత లోపలికి అనుమతించమని అధికారులు తెలిపారు. దివ్యాంగ అభ్యర్థులకు గ్రౌండ్ ఫ్లోర్లో సీటింగ్ ఏర్పాటు చేయాల కలెక్టర్ సూచించారు.
పోలీసుల ఆధ్వర్యంలో ప్రశ్నాపత్రాలను తరలించాలి
పరీక్ష కేంద్రాలకు పోలీసుల ఆధ్వర్యంలో ప్రశ్నాపత్రాలను స్ట్రాంగ్ రూం నుంచి నిబంధనల మేరకు తరలించాలని కలెక్టర్ సూచించారు. అరగంటకోసారి అభ్యర్థులకు సమయాన్ని గుర్తు చేస్తూ బెల్ మోగించాలన్నారు. అభ్య ర్థులు ప్రశ్నాపత్రంపై సమాధానాలను మార్క్ చేయవద్దని సూచించారు. ఓఎంఆర్ షీట్లో హాల్‌టికెట్ నెంబరు, ప్రశ్నాపత్రం నంబరు, పరీక్ష కేంద్రం కోడ్, అభ్యర్థి పేరుతో పాటు సంతకం చేయాలని సూచించారు.
అంధులకు అదనపు సమయం
అంధులకు ప్రతి గంట సమయానికి 20 నిమిషాల అదనపు సమయం ఇస్తారు. స్ర్కైబ్‌ను పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ నియమిస్తారని, స్ర్కైబ్ విద్యార్హత ఇం టర్మీడియట్ మాత్రమే ఉండాలి. పరీక్ష కేంద్రంలోనికి చీఫ్ సూపరింటెండెంట్, లైజన్ అధికారికి మాత్రమే మొబైల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి ఉంటుంది. మిగతా అధికారులు, ఇన్విజిలేటర్లు, సిబ్బంది, అభ్యర్థులు మొబైల్ ఫోన్లు, స్మార్ట్‌వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రం బయట డిపాజిట్ చేయాలి. అభ్యర్థులు నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసి విజ యం సాధించాలని సంగారెడ్డి కలెక్టర్ శరత్ సూచించారు.
మెదక్ జిల్లాలో పరీక్ష రాయనున్న 11,527 మంది
మెదక్ జిల్లాలో గ్రూప్-4 పరీక్ష సజావుగా నిర్వహిం చడానికి పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లావ్యాప్తంగా 30 కేంద్రాలను ఏర్పాటు చేయగా, 11,257 మంది అభ్యర్థు లు పరీక్షలు రాయనున్నారు. రెండు సెషన్స్‌లో పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఉద యం 8 నుంచి 9:45 వరకు, మధ్యాహ్నం 2.15 వరకు అనుమతి ఇస్తామన్నారు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తోపాటు సరైన గుర్తింపు కార్డుతో పరీక్షకు హాజరు కావాలన్నారు. రూట్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, లైజన్ అధికారులు సమన్వయం చేసుకుని పరీక్షలు సజావుగా నిర్వహిచాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను కలెక్టర్ ఆదేశించారు.