రామచంద్రాపురం, జూలై 4: సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్ అశోక్ నగర్‌లోని బీహెచ్ఈఎల్ పారిశ్రామిక వాడలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. భెల్ పారిశ్రామిక వాడలో కొన్ని కమర్షియల్ వ్యాపార సంస్థలు బాధ్యతారాహిత్యంగా చేస్తున్న పనుల కారణంగా పారిశ్రామిక వాడకు ప్రమాదం పొంచి ఉంది. వాహనాల సర్వీసింగ్ సెంటర్ల కారణంగా ఇంజిన్ ఆయిల్ వేస్టేజ్, గ్రీస్ అండ్ లూబ్రికెంట్స్, కెమికల్ వేస్ట్, వాటర్ తదితర రసాయనాలను ఇష్టానుసారంగా డ్రైనేజీలోకి వదులుతున్నారు.
దీంతో డ్రైనేజీ నీరు సాఫీగా వెళ్లకుండా నిలిచిపోవడంతో రసాయనాలతో కలిసిన డ్రైనేజీ నీరు పక్కనే ఉన్న నివాసాలు, వ్యాపార సముదాయల్లోకి చేరుతున్నది. గ్రీస్, పెట్రోలియం వేస్టేజ్ కారణంగా మొత్తం నల్లగా మారి వ్యాపార సముదాయాల్లోకి చేరడంతో కాలు పెడితే జారి పడిపోయే పరిస్థితి నెలకొన్నది. ఒకవేళ మంటలు అంటుకుంటే ఎంత పెద్ద ప్రమాదం సంభవిస్తుందో ఊహించలేం. కొన్ని రోజులుగా ఈ పరిస్థితి తారాస్థాయికి చేరడంతో రోడ్డు పక్కనే కొన్ని దుకాణాలు మూసు కోవాల్సిన వస్తున్నది. కార్ సర్వీసింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనల ప్రకారం ట్రీట్మెంట్ చేయకుండా, రసాయనాలను నేరుగా డ్రైనేజీలోకి వదులుతుండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
భెల్ పారిశ్రామిక వాడలో వాహనాల సర్వీసింగ్ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఆ యూనిట్లు పెట్రోలియం వేస్టేజ్‌ను శుద్ధి చేయకుండా వాటిని నేరుగా డ్రైనేజీలోకి వదులుతున్నారు. దీంతో ఆ రసాయనాలు డ్రైనేజీ నుంచి పారుతూ ఓపెన్ డ్రైన్‌లోకి, అక్కడి నుంచి వాటర్ బాడీస్‌కి చేరడంతో భూగర్భజలాలు కలుషితమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం సర్వీసింగ్ యూని ట్ల నుంచి వచ్చే వ్యర్థాలకు సహజంగా మండే స్వభావం ఉంటుంది. ఎక్కడైనా మంటలు అంటుకున్నా లేదా చాలా రోజు లు డ్రైనేజీలో పేరుకుపోయిన రియాక్షన్‌తో మంటలు వచ్చినా జరిగే ప్రమాదాన్ని అం చనా వేయలేమని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే కలెక్టర్, జీహెచ్ఎంసీ, ఐలా, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు స్థానిక వ్యాపారవేత్త సత్యవతి తెలిపారు. అయినా సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.