వివాహం జరిపించాలన్నా.. నూతన గృహ ప్రవేశం చేయాలన్నా.. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలన్నా..
వీడిన శుక్రమౌఢ్యమి
మూడు నెలల బ్రేక్ తర్వాత మంచి రోజులు
డిసెంబర్లో ముహూర్తాలు
తర్వాత శూన్యమాసం
తప్పితే 2023 కొత్త సంవత్సరంలోనే..
కొమురవెల్లి, నవంబర్ 29: వివాహం జరిపించాలన్నా.. నూతన గృహ ప్రవేశం చేయాలన్నా.. ఏదైనా కొత్త వ్యాపారం చేయాలన్నా..శుభముహుర్తం వెతుకుతాం. అదే రోజు…అదే సహయానికి సంప్రదాయంగా జరుపుతాం.. ముఖ్యంగా వివాహలు కచ్చితంగా అదే ముహూర్తానికి జరగాలని అందరూ భావిస్తారు. అటువంటి దాదాపు మూడు నెలల బ్రేక్ తర్వాత మంచి రోజులు మొదలయ్యాయి. పెండ్లి బాజాలు మోగే సమయం వచ్చింది.. ఇంటికి తోరణాలు కట్టే శుభ సమయం ఆసన్నమైంది. దాదాపు మూడు నెలల పాటు శుక్రమౌఢ్యమి కారణంగా నిలిచిన శుభకార్యాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. డిసెంబర్ 3వ తేదీ నుంచి పెండ్లి సందడి మొదలవనున్నది. ఈ మార్గశిర మాసంలో వివాహాది శుభకార్యాలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు.
ఈ యేడాది సెప్టెంబర్ 18 భాద్రపద బహుళ నవమి నుంచి శుక్రమౌఢ్యమి ప్రారంభంతో శుభకార్యాలు ఆగిపోయాయి. మౌఢ్యం నవంబర్ 27 తేదీతో వెళ్లిపోవడంతో శుభకార్యాలు చేసేందుకు తపనులు చేసుకుంటున్నారు. ఇప్పటికే ముహూర్తాలు అనుకున్నవారు మౌఢ్యం వెళ్లిన వెంటనే లగ్నపత్రికలు రాయించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుభకార్యాలకు అనుకూలంగా ఉండడంతో ఇప్పటికే కొంతమంది కల్యాణ మండపాలను బుక్ చేసుకుంటున్నారు..
మూడు నెలల తర్వాత మంచి రోజులు..
జూలైలో ఆషాఢంతో బ్రేక్ పడిన పెండ్లి ముహూర్తాలకు ఆగస్టులో మంచి ముహుర్తాలు ఉన్నప్నటికీ అవి 10 రోజులు మాత్రమే ఉండటంతో అప్పుడు సమయం లేనివారు నిశ్చయ తంబూలాలు తీసుకున్నవాళ్లు ఈ డిసెంబర్లో ఉన్న శుభముహూర్తాల్లో పెండ్లి నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ సంవత్సరం డిసెంబర్ 2, 3, 7, 8, 9, 10, 11, 14, 16, 17, 18 తేదీల్లో ఈ సంవత్సరం మిగిలిన ముహూర్తాలు ఉన్నాయి. ఈ ముహూర్తాలు తప్పితే మళ్లీ 2023 కొత్త సంవత్సరంలోనే శుభ ముహూర్తాలు ఉన్నాయి.
పెండ్లి ఎంతో మందికి ఉపాధి..
పెండ్లంటే రెండు కుటుంబాలు కలువడం అంటారు. అంతేకాదు.. పెండ్లి ఏర్పాట్లలో ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. దీంతో ఎన్నో కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. పెండ్లంటే ముందుగా గుర్తుచ్చేవి శుభలేఖలు, పట్టుచీరలు వధూవరుల పెండ్లి బట్టలు ఫొటోలు వీడియో, ట్రావెల్స్, పెండ్లి మండపాలు, పూలు, పురోహితులు, సాంస్కృతిక కళాకారులు, ఎలక్ట్రీషియన్లు, బ్యాండ్ మేళం తదితర ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది.
కోలుకుంటున్న వ్యాపారాలు..
కొవిడ్‌తో వరుసగా రెండేండ్లు దెబ్బతిన్న వ్యాపారాలు ఈ సంవత్సరం జరిగిన వివాహాలతో కాస్త కోలుకున్నాయి. జనవరి నుంచి జూన్ వరకు వివాహాలు వేల సంఖ్యలో సాగాయి. కూరగాయల నుంచి కిరాణా సరుకుల వరకు అన్ని వ్యాపారాలు ఊపందుకున్నాయి. బంగారం కొనుగోళ్లు పెరగడంతో అన్నిరకాల షాపులు కోలుకున్నాయి. మరోసారి ఈ డిసెంబర్లో అన్ని వ్యాపారాలు కళకళలాడబోతున్నాయి.
మంచి ముహూర్తాలు ఉన్నాయి
శుక్రమౌఢ్యమితో దాదాపు 3నెలలుగా శుభకార్యాలు ఆగిపోయాయి. మౌఢ్యమి తొలిగిపోవడంతో అన్ని నక్షత్రాల వారికి డిసెంబర్ 3వ తేదీ నుంది 18వ తేదీ వరకు వివాహాలకు మంచి దివ్య ముహూర్తాలున్నాయి. తర్వాత శున్యమాసం ఉండటంతో ఈ ముహూర్తాల్లో పిల్లలకు పెండ్లిండ్లు చేసేందుకు తల్లిదండ్రులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు.