వైభవంగా వనదుర్గాభవానీ మాత జాతర ప్రారంభం
కుటుంబ సమేతంగా వచ్చి పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రి హరీశ్‌రావు
అమ్మవారిని దర్శించుకున్న పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
పాల్గొన్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ హరీశ్, జడ్పీ చైర్మన్ హేమలతాశేఖర్‌గౌడ్
పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తజనం
1200 మందితో పటిష్ట బందోబస్తు
పాపన్నపేట, మార్చి 1 : ఓం నమఃశివాయ.. హరహర మహాదేవ.. శంభోశంకర.. అంటూ శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. మహాశివరాత్రి సందర్భంగా వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు తీర్చుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. జాగరణ దీక్షలో భాగంగా సంకీర్తనలు, భజనలు, సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గాభవానీ మాత ఆలయ జాతర మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్‌రావు దంపతులు పట్టువస్ర్తాలు సమర్పించారు. పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుటుంబంతో వచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సిద్దిపేట జిల్లా చేర్యాలలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామిని ఆలయంలో పెద్దపట్నం కనుల పండువలా సాగింది. హుస్నాబాద్ పరిధిలోని పొట్లపల్లి స్వయంభూ రాజేశ్వరస్వామిని సుమారు లక్ష మంది దర్శించుకున్నారు. అలాగే, నారాయణరావుపేట బుగ్గరాజేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలోని కేతకీ ఆలయం భక్తులతో కిటకిటలాడింది.
మొక్కులు తీర్చే మాయ మ్మా.. ఏడుపాయల దుర్గమ్మా.. సల్లంగ చూడే మాయ మ్మా అంటూ భక్తులు మొక్కుతుండగా ఏడుపాయల వనదుర్గాభవానీ మాత జాతర మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలను కుటుంబ సమేతంగా మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ హరీశ్, జడ్పీ చైర్మన్ హేమలతాశేఖర్‌గౌడ్ సమర్పించగా, జాతరలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివచ్చింది. అనంతరం పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ కుటుంబంతో కలిసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి జాతర మూడు రోజుల పాటు జరుగనుండగా, సోమవారం రా త్రి నుంచే భక్తులు రాక మొదలైంది. మంగళవారం వే కువజామున మంజీరా నదిలో స్నానాలు చేసి, వనదుర్గామాత సన్నిధిలో ఉపవాస దీక్షలు చేపట్టారు. రాత్రం తా జాగారం చేసి అమ్మవారికి మొక్కుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వివిధ డిపోల నుంచి ప్రతి పది నిమిషాలకో బస్సు చొప్పున సుమారు 200 బస్సులను ఆర్టీసీ నడుపుతున్నది.
అద్భుతంగా ఆలయ అలంకరణ..
వనదుర్గాభవానీ మాత ఆలయాన్ని అద్భుతంగా అలంకరించారు. రకరకాల పూలతో ఆలయ ప్రాంగణా న్ని ముస్తాబు చేశారు. అమ్మవారి గర్భగుడితో పాటు, మండపం, ధ్వజస్తంభం, ఆలయ జాలీలను ప్రత్యేకం గా రంగురంగుల పూలతో అలంకరించారు. అమ్మవారి ఆలయానికి వెళ్లే వీఐపీ దారి వెంట జాలీలను సైతం పూలతో అలంకరించగా చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నది.
బంగారు కిరీటం, నగలతో అమ్మవారి అలంకరణ
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వనదుర్గాభవానీమాత అమ్మవారిని బంగారు కిరీటం, బం గారు నగలతో అలంకరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో అమ్మవారు భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తున్నారు. మహాశివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు జరిగే జాతరను పురస్కరించుకొని వేద పండితులు ఆలయాన్ని ఐదుగంటలకే తెరిచి అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్ర త్యేక పూజలు ప్రారంభించారు. అయితే, జాతర జరిగే మూడు రోజులూ అమ్మవారు బంగారు కిరీటం, బంగా రు నగలతో దర్శనమివ్వనున్నారు.
జాతరలో ప్రత్యేకత శివుడి ఉత్సవ విగ్రహం
జాతర సందర్భంగా వనదుర్గాభవానీ మాత ఆల యం ఎదుట మంజీరానదిలో శివుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. శివుడి తలపై నుంచి గంగాజ లం కిందికి దూకుతున్న తీరు ఆకట్టుకుంటున్నది. అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ శివుడి ఉత్సవ విగ్రహాన్ని దర్శనం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా మంత్రి హరీశ్‌రావు దంపతులు, పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దంపతులు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి దంపతులు, జడ్పీ చైర్మన్ హేమలతా శేఖర్‌గౌడ్, కలెక్టర్ హరీశ్, తదితరులు ఉత్సవ విగ్రహాన్ని దర్శించుకున్నారు.
పటిష్ట పోలీసు బందోబస్తు..
ఏడుపాయలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా సంగారెడ్డి ఎస్పీ రమణకుమార్ పర్యవేక్షణలో మెదక్ డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో సుమారు 1200 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. 50పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అనుక్షణం జాతర పరిసరాలను పరిశీలిస్తున్నారు. నది పాయల్లో ప్రమాదాలు జరుగకుండా గజ ఈతగాళ్లు ఎప్పటికప్పుడు పహారా కాస్తున్నారు. ఇటీవలే సింగూరు ప్రాజెక్టు నీళ్లు ఘనపూర్ ఆనకట్టకు చేరుకోవడంతో భక్తుల స్నానాలకు ఇబ్బందులు తప్పాయి.
మనసారా మహాదేవా..
వేలాది గొంతులు శివనామస్మరణ చేశాయి. భోళా శంకురుడు తమను చల్లగా చూడాలని వేడుకున్నాయి. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పార్వతీ సమేత కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో మంగళవారం మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. తెల్లవారు జామునుంచే భక్తులు గర్భగుడిలో స్వామివారికి రుద్రాభిషేకం, పాలాభిషేకం, కుంకుమార్చన, ఆకు, అన్నపూజతో పాటు అగ్నిప్రతిష్ఠ, గణపతి హోమం, స్వామివారికి అభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి, అమృతగుండం నీటితో స్నానాలు చేసి, స్వామిని దర్శించుకొని, మొక్కులు తీర్చుకున్నారు. కొంతమంది భక్తులు దూర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చారు. భక్తుల కోసం అధికారులు భక్తులకు, భోజన వసతి, తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించారు. .
ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు పూజలు కేతకీ సంగమేశ్వర స్వామిని ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెలే మాణిక్‌రావు దర్శించుకున్నారు. రుద్రాభిషేకం, క్షీరాభిషేకం చేశారు.