నర్సాపూర్, ఫిబ్రవరి 23 : మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని బీవీఆర్ఐటీ కళాశాలలో నాలుగు రోజులుగా జరిగిన ‘ఈ బాహా ఎస్‌ఏఈ ఇండియా-2025’ బగ్గీల ఫైనల్ పోటీలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. ముగింపు వేడుకలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ వి.బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..ఎలక్ట్రిక్ అటోమోటీవ్, సెమికండక్టర్ తయారీలో యువత ప్రతిభ కనబరిచి అవకాశాలు అందిపుచ్చుకోవాలని కోరారు. బీపీసీఎల్ మార్కెటింగ్ డైరెక్టర్ సుఖ్మల్ జైన్ మాట్లాడుతూ.. బీపీసీఎల్ ద్వారా ఆవిష్కర్తలకు చేయూత అందిస్తామని వెల్లడించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. 85 జట్ల నమోదుతో ప్రారంభమైన ఈ బాహా సే ఇండియా నాలుగు రోజుల ఉత్కంఠ భరితమైన, ఉత్తేజకరమైన ప్రయాణం చివరి రోజు ఆదివారంతో ముగిసిందని తెలిపారు. 51 బృందాలు సాంకేతిక తనిఖీని విజయవంతంగా క్లియర్ చేశాయని, వాటిలో 44 జట్లు మునుపటి కఠినమైన సవాళ్లను ఎదుర్కొని ఈవెంట్ చివరి దశకు అర్హత సాధించాయని పేర్కొన్నారు.
వాటిలో 44 జట్లకు 4వ రోజున 4 గంటల ఎండ్యూరెన్స్ నిర్వహించామని, పురుషుల విభాగంలో పూణేకు చెందిన పింప్రి చించ్వాడ్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ విజేతగా నిలిచినట్లు తెలిపారు. మహిళల విభాగంలో విష్ణు ఇంజినీరింగ్ కాలేజ్ భీమవరం విజేతగా నిలిచారు. ఈ పోటీల్లో పూణే కు చెందిన కారు నెంబర్ ఈ47కి ద్రోణాచార్య అవార్డు ఎమ్ఐటీ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్‌కు చెందిన భీమాగౌడ్ పాటిల్‌కు ద క్కింది. విజేతలకు బహుమతులు అందజేశారు. వైస్ చైర్మన్ రవిచంద్రన్ రాజగోపాల్, బాహాసే ఇండియా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ బాలరాజు సుబ్రహ్మణియం, మేనేజింగ్ డైరెక్టర్ రామనాథన్, ప్రిన్సిపాల్ సంజయ్‌దూబే, మేనేజర్ బాపిరాజు పాల్గొన్నారు.