చేర్యాల, మే 8: చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించే వరకు పోరాడుతానని, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమమే తన ధ్యేయమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. చేర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో చేర్యాల, కొమురవెల్లి మండలాలకు చెందిన 19 మంది బాధితులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యేగా తాను విజయం సాధించినప్పటి నుంచి ఈ ప్రాంతంలో నెలకొన్న ప్రధాన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు.
పార్టీలకు అతీతంగా నీలిమా దవాఖానలో ఉచితంగా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు ప్రభుత్వం నుంచి క్షతగాత్రులకు, బాధితులకు సీఎం సహాయనిధి నుంచి చెక్కులు మంజూరు చేయిస్తున్నట్లు తెలిపారు. తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను గోదావరి జలాలతో అన్ని గ్రామాల్లోని చెరువులు నింపేందుకు తాను తీవ్రంగా కృషి చేస్తున్నానని, ఇటీవల దేవన్నపేట పంపుహౌస్‌ను మంత్రులు ఉత్తమ్, పొంగులేటి సందర్శించినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
తపాస్‌పల్లి రిజర్వాయర్ నింపడంతో కలిగే ప్రయోజనాలతో పాటు మల్లన్నసాగర్ నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్ వరకు రూ.300 కోట్లతో ప్రారంభించిన కాల్వ నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, యుద్ధ్దప్రాతిపదికన పూర్తి చేయించాలని మంత్రులను కోరినట్లు తెలిపారు. దేవాదుల కాల్వల నిర్మాణం, భూసేకరణ, నిర్వాసితులకు అందించాల్సిన నష్టపరిహారం తదితర అంశాలను మంత్రుల సమీక్షలో లేవనెత్తినట్లు తెలిపారు.
చేర్యాలలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయించేందుకు కృషి చేస్తున్నానని, సంబంధిత శాఖల అధికారులు సైతం సకాలంలో ప్రభుత్వ కార్యాలయాల సమీకృత భవనం, ప్రభుత్వ దవాఖాన భవనాల పనులు పూర్తి చేయించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి కోరారు.అనంతరం మున్సిపాలిటీలోని 7వ వార్డుకు చెందిన పోగుల శ్రీకాంత్‌ను ఎమ్మెల్యే పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. అంతకు ముందు మండలంలోని కమలాయపల్లి మాజీ సర్పంచ్ ఒరుగంటి అంజయ్య కుమారుడు వివాహా వేడుకకు ఎమ్మెల్యే హాజరై ఆశీర్వదించారు.
కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అనంతుల మల్లేశం, మాజీ ఎంపీపీ వుల్లంపల్లి కరుణాకర్, మాజీ జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, సీనియర్ నాయకులు అంకుగారి శ్రీధర్‌రెడ్డి, పుర్మ వెంకట్‌రెడ్డి, తలారి కిషన్, మంగోలు చంటి, బీరెడ్డి ఇన్నారెడ్డి, తాడెం రంజితాకృష్ణమూర్తి, పచ్చిమడ్ల మానస, మీస పార్వతి,జింకల పర్వతాలుయాదవ్, మంచాల కొండయ్య, బూరగోని తిరుపతిగౌడ్, గదరాజు యాదగిరి, బొడిగం మహిపాల్‌రెడ్డి, ఎలికట్టె శివశకంర్, అరిగే కనకయ్య, ఆకుల రాజేశ్ గౌడ్, ఎర్రోల్ల యాదగిరి, బంగారిగల్ల కిరణ్‌కుమార్, రాము, పచ్చిమడ్ల చిన్న సతీశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.