హుస్నాబాద్ టౌన్, జూన్ 5: సిద్దిపేట జిల్ల్లా హుస్నాబాద్‌లో శుక్రవారం నుంచి రైతు మహోత్సవం కార్యక్రమం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి తెలిపారు. హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డులో మూడు రోజుల పాటు జరిగే రైతు మహోత్సవ కార్యక్రమం ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. రైతుల హాజరు, బందోబస్తు, వాహనాల ఏర్పాటు, విద్యుత్ తదితర సౌకర్యాలపై ఆయా శాఖల అధికారులతో చర్చించారు.
అనంతరం మీడియాతో కలెక్టర్ మనుచౌదరి మాట్లాడుతూ.. సిద్దిపేట, జనగామ, హన్మకొండ, కరీంనగర్ జిల్లా ల కూడ రైతులు హాజరవుతారని తెలిపారు. రైతులకు సాంకేతిక పరిజాన్ఞం, సాంకేతికతో కూడిన వ్యవసాయం, వాణిజ్యపంటలు, ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. శాస్త్రవేత్తలు, వ్యవసాయ కళాశాల నుంచి ప్రొఫెసర్లు, వ్యవసాయ సంబంధిత కంపెనీల ప్రతినిధులు, వ్యవసాయం, సెరికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ శాఖల అధికారులు హాజరవుతారని కలెక్టర్ తెలిపారు.
ఈ మేళాలో 134 స్టాల్స్‌ను ఏర్పాటు చేశామని, ఈ వర్క్‌షాపు వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు సైతం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమానికి హాజరయ్యే రైతులకు తాగునీరు, భోజన వసతి కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రారంభ కార్యక్రమానికి వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, బీసీ సంక్షేమంశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ హాజరవుతారని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హామీద్, జిల్లాగ్రంథాలయ సంస్థచైర్మన్ కేడం లింగమూర్తి, ఆర్డీవో రామమూర్తి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగిల్ విండోచైర్మన్ బొలిశెట్టి శివయ్య,అధికారులు పాల్గొన్నారు.