సిద్దిపేట, మార్చి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘తెలంగాణ వడ్లు కొనాలని అడిగితే, అనవసర కిరికిరేంది? కేంద్ర మంత్రి ఏకంగా ‘తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించండి’.. అని ఎలా మాట్లాడుతారు?..ఇదేనా బీజేపీ రైతులకు చేసే మేలు? ఇక్కడి ప్రాంత ప్రజలన్నా? రైతులన్నా వారికి గౌరవం లేదా?.. రైతులను అవమాన పర్చేలా మాట్లాడిన కేంద్ర మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి..! అని అటు రైతులు.. ఇటు ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. వానకాలం నుంచి రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ కేంద్రం ధాన్యం కొనుగోలు చేయడం లేదు. రైతులకు ఇబ్బందులు కష్టం ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ముంగిటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ధాన్యం కొన్నది. కానీ, రైతులను ఇబ్బందులు పెట్టేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని రైతులు, రైతు సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
తెలంగాణ ప్రజలు నూకలు తినండి’.. అంటూ కేంద్ర మంత్రి |పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంత రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని అడిగితే, ఇక్కడి రైతులు, ప్రజలను అవమాన పర్చేలా కేంద్ర మంత్రి మాట్లాడడం ఎంత వరకు కరెక్ట్? అంటూ రైతు సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర మంత్రి ఏకంగా ‘తెలంగాణ ప్రజలకు నూకలు తినిపించండి’.. అని ఎలా మాట్లాడుతారు? ఇదేనా బీజేపీ రైతులకు చేసే మేలు? ఇక్కడి ప్రాంత ప్రజలన్నా? రైతులున్నా వారికి గౌరవం లేదు? తెలంగాణ రైతులను అవమాన పర్చేలా మాట్లాడిన కేంద్ర మంత్రి, తక్షణమే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వాస్తవంగా యాసంగి ధాన్యం మిల్లింగ్ చేస్తే నూకలు ఎక్కువగా అవుతాయి. ఇది తెల్వకుండా ఎలా మాట్లాడుతారని కేంద్ర మంత్రిని రైతులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాలపై ఏర్పడింది.
ఇప్పుడు సీఎం కేసీఆర్ భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడంతో పెద్ద ఎత్తున రిజర్వాయర్లు నిర్మించారు. దీంతో ఈ ప్రాంతానికి పుష్కలంగా సాగునీరు వచ్చింది. సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. నాడు పడావున్న భూముల్లో సైతం నేడు బంగారు పంటలు పండుతున్నాయి. ఈ ప్రాంతంలో వరి సాగును ఎక్కువగా చేస్తుంటారు. దీంతో ధాన్యం ఎక్కువగా పండుతుంది. ఈ విషయం తెలుసుకోకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో కిరికిరి పెడుతుంది. ఒకే దేశంలో రెండు విధానాలు ఎలా ఉంటాయి. పంజాబ్ రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యం కేంద్రం కొనుగోలు చేస్తున్నది. తెలంగాణ ప్రాంత రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయరనేది సూటి ప్రశ్న. దీనికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. పైగా అవమానించేలా కేంద్ర మంత్రి మాటలున్నాయి. వానకాలం నుంచి రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ధాన్యం కొనుగోలు చేయడం లేదు. రైతులకు ఇబ్బందులు కలగవద్దు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుల ముంగిటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ధాన్యం కొన్నది. కానీ, రైతులను ఇబ్బందులు పెట్టేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని రైతులు, రైతు సంఘాల నాయకులు బీజేపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
వరి సాగు విస్తీర్ణం పెరిగింది..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం కావడంతో పుష్కలంగా సాగునీరు వచ్చింది. దీంతో వరి సాగు పెరిగింది. గతంలో పడావున్న భూములు నేడు బంగారు పంటలు పండుతున్నాయి. ప్రతి గుంట సాగులోకి వచ్చింది. గత యాసంగితో పోల్చుకుంటే ఈ సారి రాష్ట్ర ప్రభుత్వ సూచనతో రైతులు వరిని కొంత తగ్గించారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, ఇతర పంటలు సాగు చేయాలని రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీంతో వరి విస్తీర్ణం కొంత తగ్గింది. ప్రస్తుత యాసంగిలో సిద్దిపేట జిల్లాలో 2,40,350 ఎకరాలు, మెదక్ జిల్లాలో 1,67,275 ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 1,37,100 ఎకరాలు సాగైంది. ఈ ప్రాంతంలో వరి సాగు విస్తీర్ణం ఎక్కువ ఉంటుంది. ప్రతి రైతు కూడా వరి సాగు చేస్తుంటారు.
ఇన్నాళ్లు సాగు నీరు లేక పంటలు పండలేదు. సాగు నీరు లేక వలసలు పోయిన రైతాంగం సాగు నీరు రాగానే వలసలు వాపస్ వచ్చాయి. ఉన్న ఊళ్లోనే పంటలు పండించుకుంటున్నారు. చేతినిండా పని దొరికింది. రైతుల సంబురం పడుతున్న సమయంలోనే కేంద్రం తెలంగాణ రైతులపై కక్ష సాధింపులకు దిగుతున్నది. గత వానకాలం నుంచి రైతుల ధాన్యం కొనుగోలు చేయడానికి సవాలక్ష కారణాలు చూపుతూ ఇక్కడి రైతులను మోసం చేస్తున్నది. బీజేపీ ప్రభుత్వం మోసం చేస్తున్న తీరును ఎండగడుతూ గత వానకాలం ధాన్యం సేకరణ నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నది. ఎన్ని సార్లు మొత్తుకున్న కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోలేదు. ప్రస్తుతం వేసిన పంటను సైతం కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయడం లేదు. మరో నెల రోజులైతే, యాసంగి ధాన్యం రైతుల చేతికి వస్తుంది. ఈ లోగా కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని, రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గత యాసంగిలో పుట్లకొద్దీ ధాన్యం
గత యాసంగిలో పుట్ల ధాన్యం పండింది. రైతు పండించిన ప్రతి గింజా రాష్ట్ర ప్రభుత్వం కొన్నది. రైతు ముంగిట్లోనే కేంద్రాలు పెట్టి, ధాన్యం సేకరించింది. ధాన్యం డబ్బులను నాలుగైదు రోజుల్లోనే బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుబంధు అందివ్వడంతో పాటుగా ఎరువులు విత్తనాలను అందుబాటులో ఉంచింది. దీంతో రైతు సంబురంగా పంటలను పండించారు. విద్యుత్ కోతలు లేకుండా రైతాంగానికి కరెంట్ ఇవ్వడంతో గుంట ఎండిపోకుండా సాగు చేసిన కాడికి రైతుకు పంట పండింది. గోదావరి జలాలతో రావడంతో చివరి పంటను కాపాడుకున్నారు. సిద్దిపేట జిల్లాలో 4,82,059 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొన్నది. మెదక్ జిల్లాలో 3,68,853 మెట్రిక్ టన్నులకు పైగా, సంగారెడ్డి జిల్లాలో 1,66,827 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. గత యాసంగిలో ఉమ్మడి జిల్లాలో 10,17,739 మెట్రిక్ టన్నుల ధాన్యం పైగా కొనుగోలు చేశారు. దీని విలువ రూ. 1921.50 కోట్లు.
నూకలు తినాలన్న వారికి నూకలు చెల్లాయి
తెలంగాణ ప్రజలను నూకలు తినమని అన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్టీకి నూకలు చెల్లడం ఖాయం. తెలంగాణ ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తుండడంతో వారు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన కేంద్రం, తెలంగాణ రైతాంగాన్ని తిప్పలు పెట్డడం సరికాదు. నూకలు తినాలన్న వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందే. తెలంగాణ ప్రజలను చులకన చేసి మాట్లాడిన మంత్రిని కేంద్రం డిస్మిస్ చేయాలి.
– అందె బీరన్న, జిల్లా అధ్యక్షుడు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
నూకల అన్నమే అసలైన కూడు..
ఎనకటికి నూకల అన్నమే మాకు అసలైన కూడు. మా తరమంతా నూకలను వండుకుని తినే బతికినం. నూకలు సంపాదించుకోడానికి నానా తిప్పలు పడ్డం. ఇప్పుడు నాయకులు నూకల గురించి చులకనగా, చిన్న చూపు చూస్తూ మాట్లాడటం సరికాదు. ఇప్పుడు బీజేపీ లీడరు తెలంగాణ వాళ్లను నూకలు తినండి అని అంటుండు. ఒకప్పుడు నూకల తిండే మహా ప్రసాదంగా తిని కడుపు నింపుకున్నం. తెలంగాణ ప్రజల పట్ల ఇలానే వ్యవహరిస్తే బీజేపీ సర్కార్కు నూకలు చెల్లినట్లే.
– నీరుడి నర్సయ్య, నర్సాపూర్