సిద్దిపేట (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/అందోల్, అక్టోబర్ 5 : వంట నూనెల ధరలు ఆకాశాన్ని అంటుతున్నా యి. దీనిని ఆసరాగా చేసుకుని మార్కెట్లో కల్తీనూనెల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. వివిధ రకాల బ్రాండ్ల పేర్లతో.. రంగురంగుల ప్యాకెట్లతో అమ్ముతూ అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. కల్తీలపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, మెదక్, నర్సాపూర్, జహీరాబాద్, పటాన్చెరు, నారాయణ్ ఖేడ్, సంగారెడ్డి పట్టణ కేంద్రాలు కల్లీ నూనెలకు కేంద్రాలుగా మా రాయి.
ఈ పట్టణాల్లో తయారుచేసిన కల్త్తీ నూనెలను ఆయా గ్రామాల్లోని కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. ఇటీవల కాలంలో నూనెల ధరలు విపరీతంగా పెరగడంతో వ్యాపారులు యథేచ్ఛగా కల్తీనూనెల విక్రయాలు చేస్తున్నారు. లీటర్‌పై రూ. 30 నుంచి రూ.50 వరకు ధర పెరగడంతో కల్తీ నూనెల వ్యాపారం జోరుగా సాగుతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మార్కెట్లో నిత్యం 350 పైగా టన్నుల నూనెల విక్రయాలు జరుగుతున్నాయి. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 20శాతం మేర పెంచింది.
దీంతో నూనెల ధరలు భగ్గుమంటున్నాయి. జిల్లాలో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు విస్తీర్ణం తగ్గుతున్నది. బయట ప్రాంతాల నుంచి జిల్లాకు నూనెలు దిగుమతి అవుతున్నాయి. చాలావరకు నూనెలు నాసిరకం ఉం టున్నాయి. వివిధ రకాల బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి వచ్చిన వాటిలో నాసిరకం ఎక్కువగా ఉంటున్నాయి. అరికట్టాల్సిన సంబంధిత శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. నాసిరకం నూనెల వాడకం ప్రజారోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నది.
కల్తీ వంట నూనెల వాడకంతో తల తిప్పడం, కడుపు నొప్పి, వికారం, విరేచనాలు, కడుపులో మంట, చర్మం పై దుద్దర్లు తదితర అనారోగ్య సమస్యలు తలెత్తి వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. వంట నూనె లు కల్తీ కావడంతోనే ఇలా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి లైసెన్స్‌లు లేకున్నా బహిరంగ మార్కెట్లో విడినూనెలు ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. పుడ్ సేప్టీ అధికారులకు ఇవేమీ పట్టడం లేదు.
వ్యాపారులు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడి వీటిని మరిచి పోతున్నారని, ప్రతినెలా నూనెల తయారీ కేంద్రాలను తనిఖీ చేయాల్సి ఉన్నప్పటికీ వాటివైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నాణ్యమైన నూనెల విక్రయాలు, ధరల నియంత్రణ, జీరో వ్యాపారాన్ని అరికట్టడంలో అధికారుల మధ్యన సమన్వయ లోపం కొట్ట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ఇది వ్యాపారులకు కలిసి వస్తున్నది. సహజంగా ఒక వ్యాపారి ఇంత నూనె నిల్వ చేసుకోవాలని ఉంటుంది.
అంతకన్నా ఎక్కువ నిల్వ చేసుకుంటే పౌరసరఫరాల శాఖ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. హోల్‌సేల్ వ్యాపారులు 600 క్వింటాళ్ల వరకు, ఇతర ప్రాంతాల్లో 350 క్వింటాళ్ల వరకు,జిల్లా కేంద్రంలో రిటైల్ వ్యాపారి 50 క్వింటాళ్ల వరకు, ఇతర ప్రాంతాల్లో 30 క్వింటాళ్ల వరకు నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఇవి నిబంధనలు. కానీ, ఇవేవి అమలు కావడం లేదు. పట్టణాల్లో, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నూనెల నిల్వలు ఉం చుతున్నారు. అనుమతి లేని నూనెల నిల్వ కేంద్రాలు జిల్లాలో వందల సంఖ్యలో ఉన్నాయి. వీటిపై కనీసం అధికారులు కన్నెత్తి చూడడం లేదు. కల్తీ వ్యాపారాన్ని అరికట్టడంలో ఫుడ్, పౌర, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో వెళ్తేనే కల్తీలకు చెక్ పడుతుంది.
ఇష్టారీతిన వంట నూనెల ధరలను పెంచడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ముడి పామాయిల్, సోయాబీన్, సన్‌ప్లవర్, పల్లి, నువ్వుల నూనెలు మార్కెట్లో ఎక్కువగా అమ్ముతున్నారు. మధ్యతరగతి ప్రజలు వినియోగించే పామాయిల్ లీటరు ప్యాకెట్‌పై రూ. 30 వరకు ధర పెరిగింది. సన్ ప్లవర్ ధర అంతే పెరిగింది. ప్రభుత్వం సుంకం విధింపును సాకుగా చూపి వంట నూనెల ధరలు పెంచింతే ప్రైవేట్ ఆయిల్ కంపెనీల ఇంకా ఎక్కువగా పెంచుతున్నాయి.
ధరలు పెరిగి పోతుండడంతో కృత్రిమ కొరతను సృష్టించి డీలర్లు సొమ్ముచేసుకుంటున్నారు. వంట నూనెల ధరలు అమాంతం పెరుగుతుండడంతో పాత స్టాక్‌ను బ్లాక్ చేసి వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. రవాణా చార్జీలు పెరగడం, ముడిసరుకు కొరత…ఇతరత్రా కారణాలతో నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. 15 రోజుల్లో లీటర్ ఆయిల్ ప్యాకెట్ ధరలు రూ.25 నుంచి 35 వరకు పెరిగాయి. దీంతో మధ్యతరగతి, రోజువారీ కూలీ, పనులకు వెళ్లే వారు ధరల పెరుగుదలతో ఆందోళన చెందుతున్నారు.
పాత స్టాక్‌ను బ్లాక్ చేసిన వ్యాపారులు దుకాణాల వద్ద నోస్టాక్ బోర్డులు పెట్టి పాత ప్యాకెట్లనే ఎంఆర్పీపై రూ. 30 నుంచి రూ40 వరకు అధికంగా విక్రయిస్తున్నారు. వారం క్రితం 15 లీటర్ల ఆయిల్ డబ్బా రూ.1400 నుంచి 1500 మధ్యనుండగా, ఇప్పుడు రూ.2000- 2200పైగా ఉన్నది. లీటరు ఆయిల్ ప్యాకెట్ సైతం రూ.110-115 ఉండగా, కొన్ని రోజులుగా రూ.రూ. 125 నుంచి రూ.135 వరకు చేరుకుంది. నూనె ధరలతో వినియోగదారులు ఇబ్బందులు పడుతుండగా.. ఇదే సమయంలో హోటళ్ల నిర్వాహకులకు ఆర్థికంగా భారం పడుతున్నది.
వీటితోపాటు నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు కూడా అమాంతం పెరగడంతో సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నారు. అధిక ధరలను నియంత్రించాని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.