మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఉద్యోగుల సంబురాలు
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు
పటాకులు కాల్చి, స్వీట్లు తినిపించుకున్న మెప్మా సిబ్బంది
సీఎం కేసీఆర్‌కు రుణపడిఉంటామన్న ఫీల్డ్ అసిస్టెంట్లు
ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి వేడుకలు
మెదక్/ సంగారెడ్డి న్యూస్‌నెట్‌వర్క్, మార్చి 15;ఐకేపీ, మెప్మా, సెర్ప్ మహిళలు, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచడంతో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. ఉద్యోగులు పటాకులు కాల్చి, ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. జై కేసీఆర్.. జైజై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. టీఆర్ఎస్ హయాంలోనే మహిళలకు సరైన గుర్తింపు లభించిందని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు జీతాలు అమలు చేస్తామని చెప్పడం సంతోషాన్నిచ్చిందని మెప్మా సిబ్బంది అన్నారు. మహిళలకు రక్షణ, సంక్షేమంలో తెలంగాణ సర్కార్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. కొద్దికాలంగా ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న తమను మళ్లీ విధుల్లోకి తీసుకుని సీఎం కేసీఆర్ పెద్దమనస్సు చాటుకున్నారని ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.
ఐకేపీ, మెప్మా మహిళలు, మధ్యా హ్న భోజన కార్మికులకు వేతనాలు పెంచడంపై మంగళవారం మెదక్ మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మెప్మా మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం పటాకులు కాల్చి సం బురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మహిళలకు స్వీట్లు తినిపించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మహిళాబంధు అని అన్నారు. వేతనాల పెంపుతోపాటు ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ వచ్చిన తరువాతే మహిళలకు సరైన గుర్తింపు, గౌరవం లభించిందన్నారు. కార్యక్రమంలో మెప్మా పీఆర్సీలు సునీత, దేవపాల, మాధవి, లక్ష్మి, మంజుల, ము న్సిపల్ మాజీ వైస్‌చైర్మన్ అశోక్, కౌన్సిలర్ జయరాజ్, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శులు గడ్డమీది కృష్ణాగౌడ్, బొద్దుల కృష్ణ ఉన్నారు.
– పటాకులు కాల్చి, మిఠాయిలు పంచి..
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు అమలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సంబురాలు జరుపుకున్నారు. జిల్లా మెప్మా ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పటాకులు కాల్చి మిఠాయిలు పంచి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెప్మా జిల్లా అధ్యక్షుడు బస్వంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 14 సంవత్సరాలుగా మాములు జీతాలతో పనిచేస్తూ ప్రభుత్వ పథకాల అమలులో మెప్మా ఉద్యోగులు క్రియశీల పాత్ర పోషిస్తూ పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నారన్నారు. తమకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మెప్మా సంఘ నాయకులు భిక్షపతి, మల్లేశ్వరి, స్వర్ణకుమారి, విజయ భారతి, సువర్ణ, రాజ్యలక్ష్మీ, ప్రణిత పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌కు ఫీల్డ్ అసిస్టెంట్లు క్షీరాభిషేకం
ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని ప్రకటించడంపై ఫీల్డ్ అసిస్టెంట్లు హర్షం వ్యక్తంచేస్తూ జోగిపేటలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మళ్లీ తమను విధులోకి తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇంతకాలం ఉపాధి లేకపోవడంతో ఇబ్బందులు పడ్డామని, సీఎం ప్రకటన తమ కుటుంబాలను ఆదుకున్నదన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో నారాయణఖేడ్‌లో ఫీల్డ్ అసిస్టెంట్లు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం సమ్మె చేసిన కారణంగా తాము విధులకు దూరం కాగా, సీఎం కేసీఆర్ పెద్ద మనసుతో తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించడం హర్షణీయమన్నారు. మానవతా వాది అయిన సీఎం కేసీఆర్ సూచించిన రీతిలో నడుచుకోవడమే కాకుండా సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డిల మేలును ఎన్నటికి మరువబోమన్నారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్లు పెంటయ్య సాయిలు, సిద్దు, సురేశ్, రాజు, నరేందర్, నారాయణ, జ్ఞానేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
మునిపల్లి మండల వ్యాప్తంగా ఫిల్డ్ అసిస్టెంట్లు అనందం వ్యక్తం చేస్త్తూ సంబురాలు నిర్వహించారు. మునిపల్లిలో ఫీల్డ్ అసిస్టెంట్లు, టీఆర్ఎస్ సోషల్ మీడియ మండల కన్వీనర్ రాజేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లో తీసుకోవాలని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు.