ఝరాసంగం, మే 2: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని ఎల్గోయిలో ఐదు రోజులుగా త్రీఫేజ్ విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని, ఫలితంగా సాగులో ఉన్న పంటలు ఎండుముఖం పడుతున్నాయంటూ రైతులు శుక్రవారం ఎల్గోయి సబ్స్టేషన్ ఎదుట నిరసన తెలిపారు. ఎండల తీవ్రత ఎక్కువ ఉండడం, కరెంట్ కోతలతో పంటలకు సాగునీరు అందక పోవడంతో పంటలు ఎండిపోతున్నట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మా ఊరిలో సబ్స్టేషన్ ఉన్నా కరెంట్ కష్టాలు తప్పడం లేదని తెలిపారు.
స్థానిక లైన్మెన్కు, ఏఈకి అనేకసార్లు ఫోన్లు చేసినప్పటికీ సరిగ్గా స్పందించడం లేదన్నారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించకపోతే తాము డివిజన్ స్థాయిలో నిరసనలు చేపడుతామని రైతులు హెచ్చరించారు. నిరసనలో రైతులు అశోక్, అంజన్న, శేఖర్, యేసయ్య, ప్రభు, జానుమీయ, మక్బూల్, విఠల్, విశ్వనాథం, నగేశ్, వెంకన్న, సిధ్దన్న, రాములు పాల్గొన్నారు.