ఏడుపాయల వనదుర్గాభవానీ ఆలయం రెండో రోజు భక్తులతో కిక్కిరిసింది. జాతరలో ప్రధాన ఘట్టమైన బండ్ల ఊరేగింపు ఆదివారం కన్నుల పండువలా జరిగింది. కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. రంగురంగుల చీరలు చుట్టి, కొబ్బరి మట్టలు, మామిడి ఆకులతో బండ్లను ముస్తాబు చేసి దేవతల విగ్రహాలు, చిత్రపటాలతో ఊరేగింపు నిర్వహించారు. ఆనవాయితీగా పాపన్నపేట సంస్థానాధీశుల బండి ముందు వెళ్లగా, మిగతావి అనుసరించాయి. శివరాత్రి ఉపవాస దీక్షలు చేపట్టిన వారు ఆదివారం ఉదయం మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకుని దీక్ష విరమించారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు భక్తులను అలరించాయి.
– పాపన్నపేట, ఫిబ్రవరి 19
పాపన్నపేట, ఫిబ్రవరి 19: ఏడుపాయల వనదుర్గమ్మ క్షేత్రం రెండో రోజు ఆదివారం భక్తజన సంద్రమైంది. సాయంత్రం మహాజాతరలో కీలక ఘట్టమైన బండ్ల ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. ఆనవాయితీ ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండిముందు నడువగా మిగిలిన బండ్లు అనుసరించాయి. రంగురంగుల చీరలతో అలంకరించిన బండ్ల ఊరేగింపు కార్యక్రమాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు ఆదివారం ఉదయం మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలాచరించి జగన్మాతను దర్శించుకుని దీక్షలు విడిచారు. ఆలయ పరిసరాల్లో ఎక్కడచూసినా భక్తుల రద్దీ కనిపించింది. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాలు అలరించాయి. అమ్మవారి ఆలయం విద్యుత్ కాంతులతో ధగధగలాడుతోంది. జాతర చివరి రోజు సోమవారం రాత్రి రథోత్సవం జరగనుంది. ఈ మహారథోత్సవ క్రతువును అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవాదాయశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
బండ్ల ఊరేగింపు
డప్పు చప్పుళ్ల మధ్య బండ్లు తిరిగే కార్యక్రమం కనుల పండువలా జరిగింది. దరువుకు అనుగుణంగా శివసత్తుల నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు, దుర్గమ్మ నామస్మరణతో ఏడుపాయల అటవీ ప్రాంతం మార్మోగింది. ఎడ్ల బండ్లను రంగురంగుల చీరలు, కొబ్బరి మట్టలు, మామిడి కొమ్మలతో ప్రత్యేకంగా అలంకరించి, దేవతల విగ్రహాలు, ప్రతిమలు, చిత్రపటాలను ప్రతిష్ఠించి ఊరేగించారు. సాయంత్రం ప్రారంభమైన బండ్లు తిరిగే ఘట్టం నాగ్సాన్పల్లి వైపు నుంచి దుర్గామాత ఆలయం వరకు చేరుకుని జాతర చుట్టూ తిరిగాయి. కార్యక్రమంలో ఇఫ్కోడైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మెదక్ ఆర్డీవో సాయిరాం, మెదక్ డీఎస్పీ సైదులు, ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, ఈవో సార శ్రీనివాస్‌తో పాటు పలువురు అధికారులు, నాయకులు పాల్గొని ప్రారంభించారు.
దర్శించుకున్న ప్రముఖులు
అమ్మవారిని ఎమ్మెల్సీ శేరిసుభాశ్‌రెడ్డి, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడు మైనంపల్లి రోహిత్ పాటు పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వేద పండితులు, ఆలయ చైర్మన్ బాలాగౌడ్, ఈవో సార శ్రీనివాస్, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీ శేరి సుభాశ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని దేవాలయాలను అభివృద్ధి చేసినట్లుగానే వనదుర్గామాత ఆలయాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తారని అన్నారు. మంజీరా నది ఏడుపాయలుగా చీలి గరుడ గంగగా వెలసిన వనదుర్గామాత ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలని అమ్మవారిని మొ క్కుకున్నట్లు వెల్లడించారు.
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మాట్లాడుతూ తమ కుమారుడు డాక్టర్ మైనంపల్లి రోహిత్ ఆధ్వర్యంలో మైనంపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో త్వరలో ప్రజాహిత కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్సీతో పాటు పాపన్నపేట మండల పార్టీ నాయకుడు ప్రశాంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి,సర్పంచ్‌లు దేవాగౌడ్, మహిపాల్‌రెడ్డి, శ్రీకాంత్, శ్రీనునాయక్, మన్నె లక్ష్మీనారాయణ, వికాస్ ఎంపీటీసీలు దుర్గారావు, శ్రీనివాస్, సిద్దిరెడ్డి, మాజీ ఎంపీటీసీలు గోపాల్‌రావు, తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి వెంట మైనంపల్లి స్వచ్ఛంధ సేవాసంస్థ నాయకుడు విశాల్‌రాజు, కుత్బుల్లాపూర్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ సభ్యుడు నక్కాప్రభాకర్గౌడ్, పాపన్నపేట మండల మాజీ టీఆర్ఎస్ నాయకులు ప్రశాంత్‌రెడ్డి, మండల సర్పంచ్‌లఫోరం మాజీ మండల అధ్యక్షుడు చావా పాపారావు తదితరులు పాల్గొన్నారు.
నేడు రథోత్సవం
మూడు రోజుల పాటు జరిగే దుర్గాభవానీమాత జాతర మూడవ రోజు సోమవారం చివరి ఘట్టం రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. రథోత్సవం రాత్రి సమయంలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమం రథం గోలి వద్ద ప్రారంభమై రాజగోపురం వరక కొనసాగుతుంది. రథం లాగే కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొంటారు.
పటిష్ట బందోబస్తు
బండ్ల ఊరేగింపు కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. మెదక్ డీఎస్పీ సైదులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఏడుపాయల చైర్మన్ బాలాగౌడ్, ఈవో సార శ్రీనివాస్ తమశాఖల అధికారులతో కలిసి పర్యటించి, ఇతర శాఖలతో ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ భక్తులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు. జాతరలో బండ్లు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.