మెదక్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : విద్యారంగ సమస్యలను పరిష రించాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో శుక్రవారం మెదక్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భం గా ఎస్ఎఫ్ఐ నాయకులు సంతోష్, జగన్, ప్రవీణ్ మాట్లాడుతూ… రాష్ట్రంలో పెండింగ్లో రూ.8వేల కోట్ల స్కాలర్షిప్ లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయన్నారు.ట్యూషన్ ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని విద్యార్థులను ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఇబ్బం దులు గురిచేస్తున్నాయని తెలిపారు.స్కాలర్షిప్లు, ఫీజు రీ యింబర్స్మెంట్ రాక రాష్ట్రంలో 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. జూనియర్ కళాశాలల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయని తెలిపారు.
మధ్యాహ్న భోజన పథకాన్ని పక్కాగా అమలు చేయాలన్నారు. రామాయంపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థులు సమస్యలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యార్థులను ఎలుకలు కరుస్తున్నా ఇన్చార్జి ప్రిన్సిపాల్ పట్టించుకోవడం లేదన్నారు. మనోహరాబాద్ మం డలం కూచారంలోని కేజీబీవీ పాఠశాల ఆవరణలో ముళ్లపొదలు, చెత్తాచెదారం పెరిగి దోమలతో విద్యార్థులు చాలా ఇబ్బందులు, నీటి సమస్య వేధిస్తున్నట్లు తెలిపారు. చేగుంటలో ఎస్సీ హాస్టల్ పూర్తిగా శిథిలావస్థకు చేరి చిన్నపాటి వర్షానికి హాస్టల్ మొత్తం ఊరుస్తోందన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో పీజీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన వసతి కల్పించాలని కోరారు. పాఠశాలలు వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని,అద్దె భవనాల్లో కొనసాగుతున్న గురుకులాలు,ఎస్ఎమ్హెచ్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. ఖాళీగా ఉన్న టీచర్స్, ఎంఈవో, వార్డెన్ పోస్టులను భర్తీ చేయాలన్నారు. హాస్టళ్లలో హీటర్లు, తాగునీటి కోసం ఫిల్టర్ మిషను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.