జహీరాబాద్, అక్టోబర్ 3 : తెలంగాణ-కర్ణాటక అంతరాష్ర్ట సరిహద్ద చెక్‌పోస్టు వద్ద వాహనాల తనిఖీలో అక్రమంగా తరలిస్తున్న మత్తు పరార్థాలను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక ఎక్సైజ్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. ముంబాయి-హైదరాబాద్ 65వ నంబర్ జాతీయ రహదారిలోని మొ గుడంపల్లి మండలం మడ్గి గ్రామ శివారులోని అంతరాష్ట్ర ఎక్సైజ్ చెక్‌పోస్టు వద్ద గురువారం సాయంత్రం ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారన్నారు.
ఈ క్రమంలోనే గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న జీఎంసీ ట్రావెల్స్ (ఎన్ఏల్02 బీ3185) బస్సును తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న 46 కిలోల నైట్రో జెఫమ్ మత్తు పదార్థాల ప్యాకెట్లు లభించాయని చెప్పారు. మత్తు పదార్థాల గురించి ఆరా తీయగా గుల్బర్గాలో ఓ వ్యక్తి బస్సులో వేశాడని, వాటిని హైదరాబాద్‌లో తీసుకుంటానని డ్రైవర్‌కు చెప్పినట్లు తెలిపారన్నారు. ట్రావెల్స్‌లో పట్టుబడిన 46 కిలోల బాక్స్‌లో ఉన్న నైట్రోజెఫమ్ మత్తు పదార్థాల టాబ్లెట్లను స్వాధీనం చేసుకున్నామని, వాటికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేవన్నారు. మత్తు పదార్థాల విలువ రూ. 73,1,250 ఉంటుందన్నారు.
హైదరాబాద్‌కు తరలించేందుకు ప్రయత్నించిన గుల్బర్గాకు చెందిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టామని, ట్రావెల్స్ డ్రైవర్‌ను ఆరెస్టు చేసి, మత్తు పదార్థాలు, రూ.92 లక్షల విలువ చేసే ట్రావెల్స్ బస్సును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. భారీగా మత్తు పదార్థాలు పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు. సమావేశంలో ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.