నిజాంపేట, డిసెంబర్ 29: వ్యవసాయ రంగంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మూస పద్ధతిలో సంప్రదాయ పంటల సాగుకు స్వస్తి చెబుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు పండిస్తూ అధికంగా ఆదాయం పొందుతున్నారు. వియత్నం, థాయ్‌లాండ్, శ్రీలంక దేశాలలో పండించే డ్రాగన్ ప్రూట్ పంటను మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో ఓ యువరైతు సాగు చేస్తున్నాడు. పంట సాగు విధానం, పెట్టుబడి ఖర్చు, వచ్చే ఆదాయం లాంటి అంశాలపై అధ్యయనం చేసి క్షుణ్ణంగా తెలుసుకున్న వెంకటాపూర్(కె) గ్రామానికి చెందిన యువరైతు స్వామి తనకున్న ఒక ఎకరం వ్యవసాయ భూమిలో డ్రాగన్ ఫ్రూట్‌ను సాగు చేస్తున్నాడు. అందులోనే అంతర పంటగా వేరుశనగ వేసి ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
20 ఏండ్ల వరకు ఆదాయం
ఈ మొక్క ఒకసారి నాటితే 20 ఏండ్ల వరకు దిగుబడి వస్తుంది. నేల రకాలను బట్టి మొక్కకు నీరందించాలి. నీరు అధికంగా ఉన్న పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. ప్రతి సంవత్సరం జూన్ నుంచి అక్టోబర్ వరకు పంట చేతికొస్తుంది. ఎకరానికి రూ. 5 లక్షల వరకు పెట్టుబడి ఖర్చు వస్తుండగా, ఆదాయం మాత్రం రూ.7-8 లక్షలు ఉంటుంది.
ఔషధ గుణాలు మెండు
డ్రాగన్ ఫ్రూట్ ఫలాన్ని జ్యూస్, జామ్ వివిధ రకాల పానియాల్లో వినియోగిస్తారు. ముఖ్యంగా వీటిని తినడం ద్వారా క్యాన్సర్, బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు దరిచేరవు. హిమోగ్లోబిన్ వృద్ధితో పాటు రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అన్ని నేలలు అనుకూలం
డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలం. ఈ పంటకు నీళ్ల అవసరం చాలా తక్కువ. పూత, కాత సమయంలో మాత్రం 5 రోజులకు ఒకసారి నీటి తడిని అందిస్తే చాలు. ఒక ఎకరంలో దాదాపు 2 వేల మొక్కలు వేసుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ మొక్కల ఎదుగుదల ముఖ్యం. కాబట్టి వీటి కోసం దాదాపుగా 2 మీటర్ల దూరం ఉండేలా సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసి వాటి చుట్టూ మొక్కలను నాటి కిందకి జారిపడకుండా స్తంభంపై టైర్‌ను ఏర్పాటు చేయాలి.
అధిక ఆదాయం
నాకున్న ఒక ఎకరాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్న. దాదాపుగా 640 మొక్కలు నాటాను. రూ.5 లక్షల వరకు పెట్టుబడి అయింది. అక్టోబర్ నెలలో పంట చేతికొచ్చింది. కరోనా సమయంలో గ్రామస్తులు, ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు మా చేను వద్దకు వచ్చి డ్రాగన్ ప్రూట్లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఒక కిలోకు రూ.300 వరకు విక్రయించిన. నీటి అవసరం తక్కువ, చీడ పీడల సంక్రమణ కూడా తక్కువే. కాబట్టి మరికొంత భూమిలో సాగు చేద్దామని అనుకుంటున్నా. అంతర్ పంటగా వేరుశనగ సాగు చేస్తున్న. ఒక సారి మొక్క నాటితే దాదాపుగా 20 ఏండ్ల వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది.
– స్వామి, రైతు, వెంకటపూర్(కె)
ఇతర పంటలు సాగు చేయాలి
మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర పంటలను రైతులు సాగు చేయాలి. వాణిజ్య పంట రకమైన డ్రాగన్ ఫ్రూట్ సాగుకు తక్కువ నీళ్లు అవసరం ఉండటంతో బిందు సేద్యం, డ్రిప్ వంటి పరికరాలను ఈ పంటకు వినియోగించుకోవచ్చు. డ్రాగన్ ఫ్రూట్ పంట ఒక ఎకరాకు దాదాపుగా 6 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. వాణిజ్య పంటలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సబ్సిడీ కింద బిందు సేద్యం, డ్రిప్ పరికరాలు అందిస్తున్నది.
-రచన, ఉద్యానవన అధికారి, నిజాంపేట