మునిపల్లి, ఫిబ్రవరి 20: రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ నియోజకవర్గ పరిధిలో ఇద్దరు వ్యక్తుల చేతుల్లో దెబ్బలు తిని తీవ్రంగా గాయపడిన అంతారం గ్రామవాసి పదో తరగతి విద్యార్థిని అలియా బేగం(15) మృతి చెంది ఐదు రోజులవుతున్నది. కానీ, దీనిపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించకపోవడంపై స్థానికుల నుంచి పలు రకాల విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర మంత్రిగా ఉన్నతమైన బాధ్యతలో ఉన్నా దామోదర్ రాజనర్సింహకు అసలు మనసు ఉందా అని అభిప్రాయ పడుతున్నారు. ఈ నెల 11న మండలంలోని అంతారం గ్రామంలో ఇస్మాయిల్ అనే వ్యక్తిపై అదే గ్రామవాసులు వీరారెడ్డి, విజయ్ రెడ్డి గొడవకు దిగారు. ఇస్మాయిల్‌ను రళ్లాతో కొడుతుంటే కూతురు అలియా బేగం అడ్డుకోబోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో దవాఖానలో చికిత్స పొందుతూ ఈ నెల 16న మృతి చెందింది.
అనునిత్యం తాను ప్రజల కోసమే ప్రజల మధ్యే ఉంటానని గొప్పలు చెప్పుకుంటున్న మంత్రి దామోదర్ రాజనర్సింహకు తండ్రిని కాపాడబోయి మృతి చెందిన పదో తతరగతి విద్యార్థి కుటుంబం మాత్రం కనిపించడం లేదా? అని ప్రశ్నిస్తున్నారు. తండ్రిని కొడుతున్న వారి దగ్గరకు వెళ్లి తన తండ్రిని కొట్టొద్దు.. కొట్టొద్దు అని తండ్రి కోసం కూతురు అలియా బేగం పెట్టుకున్న కన్నీరు అంత ఇంత కాదు. తండ్రిని కొట్టొద్దని కూతురు అలియా బేగం పెట్టుకున్న కన్నీటిని ఇతరులు కరిగిపోయారు తప్ప కొడుతున్న వారు మాత్రం కరిగిపోలేరు. అంతారంలో జరిగిన ఘర్షణలో గాయపడి మృతి చెందిన అలియా బేగం కుటుంబానికి రాష్ట్ర మంత్రి దామోదర్ రాజానర్సింహ ఏ విదమైన సహకారం అందిస్తారోనని అందరూ అభిప్రాయ పడుతున్నారు..