సిద్దిపేట, జనవరి 1: విధుల్లో ఉన్న జూనియర్ వైద్యుడిపై ఓ వ్యక్తి దాడి చేసిన ఘటన సిద్దిపేట ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకుంది. జూనియర్ వైద్యులు, పోలీసుల వివరాల ప్రకారం.. ప్రభుత్వ జనరల్ దవాఖానలోని ఎమర్జెన్సీ విభాగంలో జూనియర్ వైద్యుడిగా హరీశ్ విధుల్లో ఉన్నాడు. ఆదివారం రాత్రి ఓ వ్యక్తి అనారోగ్యం తో చికిత్స నిమిత్తం దవాఖానలో చేరాడు.
పరీక్షించిన వైద్యులు ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం వార్డుకు షిప్ట్ చేశారు. ఈ క్రమంలోనే పట్టణానికి చెందిన శ్రవణ్ అనే యువకుడు మంగళవారం రాత్రి సదరు వైద్యుడితో వాగ్వాదానికి దిగి దాడిచేశాడు. దీంతో వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా దవాఖానకు చేరుకున్న వన్‌టౌన్ పోలీసు సిబ్బంది దాడి చేసి న శ్రవణ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
వైద్యుడిపై జరిగిన దాడి ఘటనను నిరసిస్తూ ప్రభుత్వ దవాఖానలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు బుధవారం ఓపీ సేవలు నిలిపి వేసి నిరసన తెలిపారు. సిద్దిపేట ఏసీపీ మధు, సీఐ వాసుదేవరావు దవాఖానకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. వైద్యులకు నచ్చజెప్పడంతో నిరసన విరమింపజేశారు. బాధిత వైద్యు డి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.