సిద్దిపేట, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా ఇంతవరకు జెండా లు మోసిన నాయకులకు నామినేటెడ్ పదవులు దక్కలేదు. ఇకెంత కాలం ఓపిక పట్టాలి అంటూ కాంగ్రెస్ అధిష్టానాన్ని నాయకులు ప్రశ్నిస్తున్నారు. పార్టీ తీరుపై లోలోపల రగిలిపోతున్నారు. అంతర్గత సమావేశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను ఇంకెప్పుడు మాకు పదవులు ఇస్తారంటూ నిలదీస్తున్నారు.
జిల్లాకు చెందిన మంత్రులు తమ అనుచరులకే నామినేటెడ్ పదవులు ఇప్పించుకుంటున్నారు తప్పా, ఇతర నియోజకవర్గాల నాయకుల గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని కాంగ్రెస్ ముఖ్య నాయకులు తమ అనుచరుల వద్ద ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పదేండ్లు కాంగ్రెస్ జెండాలను మోస్తే కనీసం పార్టీలో గుర్తింపు లేదంటూ నారాజ్ అవుతున్నారు. ఇటీవల ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులు ఎందుకు అధికార పార్టీలోకి చేరామా..? చేరి తప్పు చేశామంటూ వారిలో వారు కుమిలి పోతున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీలో కనీసం గుర్తింపు లేదని… కనీసం పార్టీ సమాచారం ఇవ్వడం లేదని… ముందుకు పోనియ్యడం లేదని. ఈ గ్రూపు రాజకీయాలు ఏంటీ అంటూ వారు వాపోతున్నారు. ఏదో సాధిస్తామని కాంగ్రెస్ పార్టీలోకి చేరితే, ఏమి చేయలేక పోతున్నాయని తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. తిరిగి పాత గూటికి చేరాలని కొంత మంది మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుత పార్టీ కౌన్సిలర్లు రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకొని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధానంగా పటాన్చెరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితో కాంగ్రెస్ పార్టీలోకి పోయిన క్యాడర్ అంతా తిరిగి బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమచారం.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా నామినేటెడ్ పదవులు బర్తీ చేయడం లేదు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని మార్కెట్ కమిటీ చైర్మన్లను ఎప్పడు నియమిస్తారంటూ పార్టీ అధిష్టానాన్ని క్యాడర్ ప్రశ్నిస్తున్నది. జిల్లాలోని దేవాదాయ పాలక మండళ్లతో పాటు ఇటీవల మూడు జిల్లాలకు పట్టణాభివృద్ధి అథారిటీలను ఏర్పాటు చేసింది. ఈ పదవులను పార్టీ సీనియర్ నాయకులు ఆశిస్తున్నారు. పదవుల కోసం ఎవరికి వారే తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి.(హుస్నాబాద్‌తో కలుపుకొని) ఈ నియోజకవర్గాల్లో ఐదారు మార్కెట్ కమిటీ చైర్మన్లను మాత్రమే నియామకం చేశారు. ఏడాది కావస్తున్నా మిగతా వాటిని ఇంత వరకు నియామకం చేయడం లేదు.
సిద్దిపేట జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన అనుచరుడికి ఇప్పించుకున్నారు. సిద్దిపేట,గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల నాయకులకు కాకుండా తన సొంత నియోజకవర్గ నేతకు ఇప్పించుకున్నారు అనే అరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులను కూడా తన సొంత నియోజకవర్గ వారికే ఎంపిక చేశారు తప్పా..ఇతర నియోజకవర్గాల్లోని మార్కెట్ కమిటీ చైర్మన్లను ఎందుకు భర్తీ చేయడం లేదని పార్టీ క్యాడర్ ప్రశ్నిస్తున్నారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేట మార్కెట్ చాలా పెద్దది.
ఈ మార్కెట్ కమిటీ పాలక వర్గాన్ని ఎప్పుడు నియామకం చేస్తారని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం సిద్దిపేట పార్టీ సీనియర్ నాయకులు పోటీపడుతున్నారు. సిద్దిపేట సుడా చైర్మన్ పదవికి సిద్దిపేట ప్రాంత పార్టీ నాయకులు పలువురు పోటీపడుతున్నారు. ఇటీవల సుడాను సిద్దిపేట జిల్లా మొత్తం విస్తరించడంతో అది కాస్త జిల్లాలోని ఏ నాయకుడికి అయినా ఆ పదవి రావచ్చని అంటున్నారు. సిద్దిపేట వరకు ఉంటే అది సిద్దిపేట నియోజకవర్గ నాయకులకు వచ్చేదని, ఇప్పుడు జిల్లాలోని అన్ని ప్రాంతాల కాంగ్రెస్ నాయకులు పోటీపడుతున్నారు.
ఈ పోస్టుకు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరి ప్రవీణ్‌రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్నది. మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవి జిల్లా కేంద్రం నాయకులకు కాకుండా నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రానికి చెందిన సుహాసినిరెడ్డికి ఇవ్వడంపై అక్కడి కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యేను గెలపిస్తే మాకు ఇదేనా గౌరవం అంటూ మెదక్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎమ్మెలే సంజీవరెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తున్నది.
ఎవరికి వారే సొంతంగా క్యాడర్‌ను తయారు చేసుకుంటున్నారు. ఈ దీంతో నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం కొలిక్కి రావడం లేదని తెలిసింది. మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్న అందోల్ నియోజకవర్గంలో అంతర్గతంగా నాయకులు గ్రూపులుగా విడిపోయారు. పార్టీ కోసం పనిచేసిన వారికి గుర్తింపులేకుండా పోయిందని క్యాడర్ నారాజ్‌గా ఉంది. కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని పాత క్యాడర్ మంత్రి తీరుపై గుర్రుగా ఉంది. పటాన్చెరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, నీలం మధు, కాటా శ్రీనివాస్ మధ్య సఖ్యత లేదు.
ఈ ముగ్గురు ఎవరికి వారే తమ పవర్‌ను చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. మొదటి నుంచి పార్టీనే నమ్ముకుని పనిచేస్తున్న తనకు న్యాయం జరగడం లేదని కాటా శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే గూడెం తీరును నిరసిస్తూ ఇటీవల ఆయన పీసీసీ చీఫ్, డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇక నీలం మధు నేరుగా సీఎం రేవంత్‌తో సంబంధాలు నెరుపుతూ అన్ని విధాలుగా ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఏడాది కాంగ్రెస్ పాలనపై ప్రజలు గుర్రుగా ఉన్నారు, హామీలు ఏమాత్రం అమలు కావడం లేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్‌లో నైరాశ్యం నెలకొంది.