మెదక్, ఏప్రిల్ 22 : ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం.. సర్కారీ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నది. నిష్ణాతులైన డాక్టర్లు, అత్యాధునిక వైద్యపరికరాలు అందుబాటులో ఉంచి పేదలకు మెరుగైన, ఉచిత సేవలు కల్పిస్తున్నది. మెదక్ జిల్లా కేంద్రం దవాఖానలో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ హబ్‌లో 365రోజులు 24 గంటలు 47 రకాల వైద్యపరీక్షలను ఫ్రీగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పీహెచ్‌సీలు, అర్బన్‌హెల్త్ సెంటర్లకు వచ్చిన రోగుల నుంచి శాంపిల్స్‌ను సేకరించి వాటిని ప్రత్యేక వాహనాల ద్వారా పెద్దాస్పత్రికి తీసుకొచ్చి టెస్టులు చేస్తున్నారు.
పరీక్షల ఫలితాలను 24 గంటల్లోగా సంబంధిత వైద్యుడు, రోగికి ఫోన్ ద్వారా సమాచారం పంపిస్తున్నారు. గత సంవత్సరం మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు 24,945 మంది నుంచి 41,121 నమూనాలను సేకరించి, 71,733 పరీక్షలు చేసి రిపోర్టులను అందజేశారు. ఒకప్పుడు టెస్ట్‌ల కోసం నగరాలకు వెళ్లి ప్రైవేటు ల్యాబ్‌లలో వేల రూపాయలు చెల్లించగా, నేడు ఆ పరీక్షలను ప్రభుత్వమే ఉచితంగా చేస్తుండడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. 47 రకాల వైద్య పరీక్షలను ఒకేచోట చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో డయాగ్నస్టిక్ హబ్ ఏర్పాటు చేసింది. కోట్లు విలువ చేసే అత్యాధునిక మిషన్లను సమకూర్చింది. డయాగ్నోస్టిక్ కేంద్రంలో రోజు వ్యవధిలోనే పరీక్షలను నిర్వహించి రిపోర్టులను ఎస్ఎంఎస్ ద్వారా రోగులకు పంపిస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శాంపిల్స్ సేకరించి ఇక్కడ పరీక్షలు చేస్తున్నారు. రోజు 3వేల వరకు పరీక్షలు నిర్వహించే సామర్థ్యం కలిగిన మిషన్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శాంపిల్స్ సేకరణ..
డయాగ్నోస్టిక్ హబ్‌లో రోగుల నుంచి శాంపిల్స్‌ను సేకరించే అవకాశం లేదు. కేవలం జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్‌కు మాత్రమే ఇక్కడ పరీక్షలను నిర్వహిస్తారు. రోజూ జిల్లాలోని అన్ని పీహెచ్‌సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లకు వచ్చే రోగులకు పరీక్షించి అవసరమైన రోగ నిర్ధారణ పరీక్షలకు సేకరించిన శాంపిల్స్‌ను 4 ప్రత్యేక వాహనాల ద్వారా డయాగ్నోస్టిక్ హబ్‌కు తీసుకొస్తారు. వాటికి ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తారు. రిపోర్టులను ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెయిల్‌కు పంపడంతో పాటు రోగికి సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా రిపోర్ట్‌ను పంపిస్తారు. ఈ రిపోర్టుల ఆధారంగా రోగులు వైద్యులను సంప్రదించి వైద్య సేవలు పొందే అవకాశం ఉంటుంది.
రోగి ఫోన్‌కు రిపోర్టు మెసేజ్..
డయాగ్నోస్టిక్ హబ్‌లో క్లీనికల్ పాథాలజీ, మైక్రోబయోలజీ, క్లీనికల్ బయో కెమిస్ట్రీకి చెందిన టెస్టులు నిర్వహిస్తున్నారు. పరీక్షల ఫలితాలను 24 గంటల్లోగా సంబంధిత ప్రభుత్వ దవాఖాన వైద్యుడికి, రోగి ఫోన్‌కు సమాచారం పంపిస్తారు. రిపోర్టుల ఆధారంగా డాక్టర్ చికిత్స చేస్తూ మందులు రాస్తున్నారు.
ఉచితంగా పరీక్షలు..
మెదక్ జిల్లా కేంద్ర దవాఖానలో ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్‌లో 2021 మార్చి నుంచి పరీక్షలను ప్రారంభించారు. 2021 మార్చి నుంచి 2022 మార్చి వరకు మొత్తం 24,945 మంది రోగుల నుంచి 41,121 శాంపిల్స్‌ను సేకరించారు. ఇందులో 71,733 పరీక్షలు చేయగా, 3లక్షల 8వేల 160 రిపోర్టుల ద్వారా సమాచారాన్ని అందించారు. జిల్లాలోని పీహెచ్‌సీలు, ప్రభుత్వ దవాఖానల్లో వైద్య పరీక్షలు చేసే అవకాశం లేకపోవడంతో ప్రజలు ప్రైవేట్ డయాగ్నస్టిక్ కేంద్రాలకు వెళ్లి వేలాది రూపాయలను వెచ్చించాల్సి వచ్చేది. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం డయాగ్నస్టిక్ కేంద్రం అందుబాటులోకి తీసుకురావడంతో పేదలు, గ్రామీణులకు కార్పొరేట్ స్థాయిలో రోగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి వచ్చి ఉచితంగా చేసే వెసులుబాటు కలుగుతున్నది.
47 రకాల పరీక్షలు..
తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా కార్పొరేట్ సెంటర్లకు ధీటుగా ఉచితంగా 47 రకాల టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ సెంటర్ల ద్వారా క్లినికల్ పాథాలజీ, మైక్రోబయోలజీ, క్లినికల్ బయో కెమిస్ట్రీకి చెందిన పరీక్షలు చేస్తారు. ముఖ్యంగా బయోకెమిస్ట్రికి చెందిన రేడియో ఏజీ, బ్లడ్ యూరియా, బ్లడ్ యూరియా నైట్రోజన్, డైరెక్ట్ ఎల్డీఎల్, ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోస్, జీజీటీ, లివిడ్ ప్రొఫైల్, ఎల్ఎఫ్టీ, పోస్ట్ లంచ్ బ్లడ్ గ్లూకోస్, రాండమ్ బ్లడ్ షుగర్, రీనల్ ఫంక్షన్ టెస్ట్, సీరమ్ బైలురూబిన్-డి, సీరమ్ బైలురూబిన్-టీ వంటి 36 రకాల టెస్టులు నిర్వహిస్తారు. అలాగే పాథాలజీకి చెందిన అబ్సల్యూట్ ఇసినోఫిల్ కౌంట్, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, కోంబ్స్ టెస్ట్ డైరెక్ట్ వంటి మొత్తం 11 రకాల పరీక్షలు చేస్తారు.
పీహెచ్సీలలో శాంపిల్స్ ఇస్తే సరిపోతుంది..
పరీక్షల కోసం పట్టణాలకు రాకుండానే అక్కడే అందుబాటులో ఉన్న పీహెచ్సీలో శాంపిల్స్ ఇస్తే ప్రత్యేక వాహనాల ద్వారా తీసుకొచ్చి పరీక్షలను నిర్వహించి రిపోర్టులను మేమే పీహెచ్‌సీకి, రోగికి పంపిస్తాం. ప్రభుత్వం అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రతిరోజూ 47 రకాల పరీక్షలు చేస్తున్నాం. 24 గంటల్లో పరీక్షల ఫలితాలను రోగి సెల్‌కు పంపిస్తున్నాం.
– ప్రజ్ఞ, డయాగ్నస్టిక్ హబ్ మేనేజర్