బెజ్జంకి, మార్చి 19: ఎల్వోసీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్లో కాంగ్రెస్ నాయకులు చేసిన గోల్మాల్ను ప్రజల ముందు పెట్టి, ఎండిన పంటలకు సాగునీళ్లు ఇవ్వాలని రైతుల పక్షాన పోరాడుతున్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఇంటిపై బుధవారం కుట్రపూరితంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దాడికి ప్రయత్నించారు. మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన అనుచరుల అరాచకాలు, అవినీతిని ఎప్పటికప్పుడు రసమయి బాలకిషన్ ఎండగడుతూ ప్రజలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. దీనిని జీర్ణించుకోని కాంగ్రెస్ ఈ ఘటనకు కుట్ర చేసిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఏసీపీ మధు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించి కాంగ్రెస్ నాయకుల కుట్రలను భగ్నం చేశారు.
కాంగ్రెస్ నాయకుల పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు మండల కేంద్రానికి చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి, అనంతరం మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో బెజ్జంకిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
కాంగ్రెస్ నాయకుల తీరును మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా ఖండించారు. అనంతరం రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. సీఎంఆర్ ఎఫ్ చెక్కుల స్వాహా వెనుక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హస్తం ఉందని, విషయం బయట పడుతుందనే భయంతోనే ఆయన ఈ కుట్రకు తెరలేపారని ఆరోపించారు. ప్రజల గొంతుకగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలపై దాడికి కాంగ్రెస్ ప్రయత్నస్తే సహించబోమని, ఇది పిరికిపంద చర్యగా భావిస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసి, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నామని, కాంగ్రేసోళ్లు పోలీసులతో మాపై ఎన్ని కేసులు పెట్టించినా, కాంగ్రెస్ గుండాలకు, రౌడీలకు, తాటకు చప్పుళ్లకు భయపడే పరిస్థితి లేదన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిల్లర వ్యవహారాలు మానుకోవాలని హితవు పలికారు.
కవ్వంపల్లి నువ్వు ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గొంతుకగా ఎప్పటికీ ప్రశ్నిస్త్తూనే పోరాడుతానని రసమయి బాల్కిషన్ పేర్కొన్నారు. పెద్దలింగాపూర్‌లో రైతులు, మహిళలు సాగునీళ్ల కోసం ధర్నా చేస్తుంటే ఎమ్మెల్యే మాత్రం రంగునీళ్లు చల్లుకుంటూ వేడుకలు చేసుకున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే అసమర్ధత వల్ల నేడు నియోజకవర్గంలో వందల ఎకరాల్లో పొలాలు ఎండుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గుండారంలో వరి పంటలు ఎండకుండా కాపాడడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని, కాలువకు మరమ్మతులు చేయిస్తే గుండారంలో ఈరోజు పంటలు ఎండే పరిస్థితి వచ్చేది కాదన్నారు. రైతుల పక్షాన పోరాడుతున్న తనపై నీ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టి దాడి చేయించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు తలుచుకుంటే నీ పరిస్థితి ఏంటో… ఊహించుకోవాలన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడిన తీరును నియోజకవర్గ ప్రజలు అసహ్యించుకుంటున్నారని, నీ ప్రవర్తను ప్రజలు చీదరించుకునారని రసమయి విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికి వదలి కవ్వంపల్లి కమీషన్ల ఎమ్మెల్యేగా మారాడని ఆరోపించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అక్రమాల చిట్టాను కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జికి పంపించినట్లు తెలిపారు. దాడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు మండల కేంద్రంలో ఎమ్మెల్యే భోజనాలు ఏర్పాటు చేయడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే రసమయి బాల్కిషన్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ నాయకులు కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకోని పోలీసులు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. ఆయన ఇంటి చుట్టూ పెద్దఎత్తున పోలీసులను మోహరించి రోడ్డు వెంట వెళ్లే వారిపై నిఘా ఉంచారు. ఏ కొంచె అనుమానం వచ్చినా పూర్తి వివరాలు సేకరించి పంపించారు. బీఆర్ఎస్ నాయకులను సైతం రసమయి బాలకిషన్ ఇంటికి వెళ్లకుండా ఎక్కడిక్కడ కట్టడి చేశారు. గుండారం పోలీసుల వలయంలోకి వెళ్లింది.