సిద్దిపేట, ఆగస్టు 13: రైతులకు సరిపడా యూరియాను సరఫరా చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాని కొరత ఇప్పుడు ఎందుకు వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం సిద్దిపేట రూరల్ మండ లం రాఘవాపూర్ వద్ద ఎరువుల కోసం రైతు లు క్యూలో బారులు తీరగా, వారిని చూసి ఆయన మాట్లాడారు. ఉదయం 5 గంటల నుంచి ఇక్కడే ఉంటున్నాం.. ఒక ఆధార్ కార్డుకు ఒక బస్తా ఇస్తామంటున్నారు అని రైతులు హరీశ్‌రావుకు మొరపెట్టుకున్నారు. ఓటీపీ అంటూ కాలయాపన చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైతులు తమ బాధను వ్యక్తం చేశారు.
కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగ నీళ్లిచ్చిన్రు.. ఊర్లలోనే యూరియా అందించారని, ఈ ప్రభుత్వం యూరియా కూడా సరిగ్గా ఇవ్వడం లేదని, పంట ఎప్పుడు వేసుకోవాలంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో హమాలీ ఖర్చుతో సహా ఇచ్చి యూరియా పంపించామని గుర్తు చేశారు. ఉదయం నుంచి రైతులు వచ్చి ఇబ్బందులు పడుతుంటే పట్టించుకునే అధికారి లేడని వ్యవసాయ శాఖ అధికారులపై ఎమ్మెల్యే సీరియస్ అయ్యారు. నాలుగు రోజుల నుంచి రైతులు ఇక్కడకు వచ్చి యూరియా కోసం పడిగాపులు కాస్తే ఒక్క బస్తా ఇస్తామని చెప్పడం బాధాకరం అన్నారు. దేవుడు దర్శనమైన దొరుకుతుందేమో కానీ.. ఎరువుల బస్తా దొరకడం లేదని మహిళా రైతు భాగ్యమ్మ చెప్పడం ఈ ప్రభుత్వం రైతులపై చూస్తున్న చిన్నచూపునకు నిదర్శనమన్నారు.
ఓటీపీ విధానం తీసివేసి రైతులకు సరిపడా యూరియా అందించాలన్నారు. నానో యూ రియా వాడడంతో రైతులకు ఎకరాకు రూ. 500 భారం పడుతున్నదని, ఇది రైతు పై అదనపు భారం వేయడమే అన్నారు. ప్రభుత్వం సబ్సిడీ నుంచి తప్పించుకోవడానికి కృత్రిమ ఎరువులు సృష్టిస్తున్నద హరీశ్‌రావు ఆరోపించారు. ఎన్నికలు ఉన్నాయని బీహార్‌కు ఎరువులు తరలిస్తున్నారని, 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు తెలంగాణ నుంచి ఉండి ఎరువుల కొరత తీర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. 51సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్‌రెడ్డి రైతుల ఎరువుల కొరత తీర్చలేదన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అన్నట్లు రేవంత్‌రెడ్డికి తిట్లు ఎక్కువ పని తక్కువ అన్నారు. ప్రజలకు కావాల్సింది పని మాత్రమేనని, రేవంత్‌రెడ్డికి తిట్ల మీద ఉన్న ధ్యాస పనిమీద లేదన్నారు. యూరియా కోసం రైతులు రోడ్డెక్కి ధర్నా చేసే దుస్థితి కల్పించారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. కాళేశ్వరం మోటార్లను ప్రాజె క్టు పరిధిలోని అన్ని రిజర్వాయర్లను నీటితో నింపి రైతులకు సకాలంలో సాగునీరు అందించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు బుధవారం రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి రైతుల పక్షాన లేఖ రాశారు.