సిర్గాపూర్, జనవరి 31: గ్రామాల్లో విద్య, వైద్యం మెరుగుపడితే గ్రామమంతా అభివృద్ధి చెందుతుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. బుధవారం సిర్గాపూర్‌లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు, శంకుస్థాపనలు చేపట్టారు. సిర్గాపూర్‌లో రూ.20లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవనం, రూ.1.54 కోట్లతో సమగ్ర శిక్షా అభియాన్ కింద కస్తూర్బా విద్యాలయం భవన సముదాయాన్ని, సర్వోదయ లైబ్రరీ, స్టడీ సెంటర్‌ను ప్రారంభించారు. స్థానిక హైస్కూ లో రూ.27లక్షలతో నిర్మించనున్న అదనపు గదుల నిర్మాణానికి, రూ.13.50లక్షలతో నిర్మించనున్న సైన్స్ భవనానికి కలెక్టర్, ఎమ్మె ల్యే భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యకు మించిన శక్తి ఏదీ లేదన్నారు. ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ పార్టీలతో ప్రమేయం లేకుండా అందరూ కలిసి పనిచేయాలన్నారు. మండలంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలని, సిర్గాపూర్, నారాయణఖేడ్‌లో ప్రత్యేక ఆధార్ సెంటర్లు అదనంగా ఏర్పాటు చేయాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. అనంతరం సర్పంచ్ల పదవీకాలం ముగుస్తున్నందున స్థానిక సర్పంచ్ జంగం స్వప్నాశంకరయ్యస్వామికి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పీరప్ప, ఆర్డీవో వెంకటేశ్, ఎంపీపీ మహిపాల్‌రెడ్డి, జడ్పీటీసీ రాఘవరెడ్డి, తహసీల్దార్ ఉమాశంకర్, ఎంపీడీవో సుజాత, ఎంఈవో శంకర్, ఎస్వో లలిత, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
నారాయణఖేడ్, జనవరి 31: పంచాయతీ భవనాల వేదికగా గ్రామాల అభివృద్ధి కొనసాగాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకాంక్షించారు. నారాయణఖేడ్ మండలం పంచగామలో రూ.16 లక్షలతో నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్‌రెడ్డితో కలిసి ప్రారంభించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆర్డీవో వెంకటేశ్, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం నారాయణఖేడ్ పట్టణ సమీపంలోని జూకల్ శివారులోని ప్రభుత్వ ఆదర్శ డిగ్రీ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈవీఎంలు భద్రపర్చేందుకు స్ట్రాం రూం, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు కోసం డిగ్రీ కళాశాల భవనాన్ని పరిశీలించారు.