సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 20: సమాజ అభివృద్ధి కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బులిటీ (సీఎస్ఆర్) నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాం తి అధికారులను ఆదేశించారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సీఎస్ఆర్ నిధుల సేకరణపై అధికారులు, పరిశ్రమల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్ఆర్ కింద జిల్లా అభివృద్ధికి నిధులు ఉపయోగించేలా చూడాలన్నారు.
సీఎస్ఆర్ నిధులను విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తామన్నారు. ముఖ్యంగా హాస్టళ్లు, దవాఖానలు, అదనపు తరగతి గదులు, విద్యా సంస్థల్లో కావాల్సిన ఉపకరణాల కోసం వినియోగించేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని ఆ యా పరిశ్రమల యాజమాన్యాలు సీఎస్ఆర్ కిం ద ఇవ్వాల్సిన నిధులు, బకాయిలపై దృష్టి సారించాలన్నారు. ఆయా నిధులతో గుర్తించిన పనులను చేపట్టాలన్నారు. సీఎస్ఆర్ నిధుల వినియోగంలో పరిశ్రమ ఉన్న ప్రాంతానికి, జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చేలా క్లస్టర్ ఇన్చార్జి అధికారులు ప రిశ్రమల యాజమాన్యాలను చైతన్యపర్చాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా శక్తి పథకం మహిళలను కోటీశ్వరులను చేసేందుకే అని కలెక్టర్ వల్లూరు క్రాంతి స్పష్టం చేశారు. ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు 13 రకాల వివిధ యూనిట్స్ లో సూపర్ మార్కెట్లు, ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్, ఈవెంట్ మేనేజ్మెంట్స్, పాల కేంద్రాలు, పౌల్ట్రీ పరిశ్రమ, మొబైల్ ఫిష్ యూనిట్స్, మహిళా క్యాం టిన్స్, కస్టమ్ మైక్రో ఎంటర్ప్రైజెస్ వంటి పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్నదని వివరించారు. మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగడానికి సూచనలు, సలహాలు, మార్కెటింగ్‌లో మెళకువలపై శిక్షణ ఇవ్వాలన్నారు. సమావేశంలో సంగారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ట్రైనీ కలెక్టర్ మనోజ్, పరిశ్రమల శాఖ జీఏం ప్రశాంత్, వివిధ శాఖల అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.