జగదేవపూర్, జూలై 10 : విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేక్షించమని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి హెచ్చరించారు. గురువారం జగదేవపూర్, తీగుల్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇడ్ల నిర్మాణ పనులు, తీగుల్‌లో సర్కారు దవాఖాన, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. తీగుల్ పీహెచ్సీలో డ్యూటీ డాక్టర్ గురించి ఆరాతీయగా, వట్టిపల్లిలో మెడికల్ క్యాంపునకు వెళ్లినట్లు సిబ్బంది తెలిపారు.
వైద్యులు, సిబ్బంది ఉదయం 9గంటల నుంచే దవాఖానలో రోగులకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. తీగుల్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వంట చేయడంలో ఆలస్యం, నీటి వృథాపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం వంట చేయట్లేదని ప్రిన్సిపల్ ఫిర్యాదు చేయగా, తొలిగించాలని సూచించారు.
ఎంపీడీవో, తహసీల్దారు పాఠశాలలను తరుచూ సందర్శించి మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టకపోతే డీఈవోకు రిపోర్టు పంపించాలని కలెక్టర్ సూచించారు. ఉద్యోగ విరమణ తర్వాత కూడా పాఠాలు బోధిస్తున్న విశ్రాంత ఉపాధ్యాయుడు బాల్‌రెడ్డిని అభినందించి భావితరాలకు ఆదర్శం అని కొనియాడారు. జగదేవపూర్, తీగుల్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు 43 మంది లబ్ధిదారులను ఎంపిక చేయగా, 22 మంది పనులు ప్రారంభించినట్లు అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో రాంరెడ్డి, ఎంపీవో ఖాజామోహినొద్ద్దీన్, అధికారులు తదితరు లు ఉన్నారు.