పటాన్చెరు రూరల్, అక్టోబర్ 24 : సంగారెడ్డి జిల్లా ముత్తంగి వద్ద ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రయాణిస్తున్న కారులో శుక్రవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ రోడ్డుపై ప్రయాణిస్తున్న బీఆర్ఎస్ నాయకుడు మాణిక్‌యాదవ్ డ్రైవర్‌ను నిలువరించడంతో అందరూ సురక్షితంగా కిందికి దిగారు. సిద్దిపేట్ నుంచి శంకర్పల్లి వెళ్లేందుకు ఆరుగురితో వస్తున్న కారు ముత్తంగి ఓఆర్ఆర్ జంక్షన్ సమీపంలోకి రాగానే అగ్నిప్రమాదానికి గురైంది.
చూస్తుండగానే కారులో మంటలు ఎగసిపడటం చూసిన ఓఆర్ఆర్పై ప్రయాణిస్తున్న మాణిక్‌యాదవ్ మంటల్లో చిక్కుకున్న కారు డ్రైవర్‌ను అప్రమత్తం చేసి కారును ఆపించారు. తక్షణం కారులోని నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు కిందికి దిగారు. వారు చూస్తుండగానే కారు అగ్నికి ఆహుతైంది. మాణిక్‌యాదవ్ ప్రయాణికులకు ధైర్యం చెబుతూ పోలీసులకు సమాచారం అందించారు. పటాన్చెరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద కారణాలను దర్యాప్తు చేస్తున్నారు.