కోహెడ, ఆగస్టు 11: బ్రిటన్ హౌజ్ ఆఫ్ లాడ్స్ సభకు ఎంపికైన ఎంపీ ఉదయ్ నాగరాజు తాను సిద్దిపేట జిల్లా కోహెడ మం డలం శనిగరం గ్రామానికి బిడ్డనేనని నిరూపించారు. బ్రిటన్ ఎంపీగా ఎన్నికైన అనంతరం తొలిపారి మంగళవారం గ్రామానికి వచ్చిన అతనికి గ్రామపంచాయతీ పాలకవర్గం, మహిళా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు, గ్రామస్తులు ఘనంగా స్వాగతించారు.
డప్పుచప్పుల్లు ,పటాకుల మోతతో ఊరంతా దద్దరిల్లింది. గ్రామం యావత్తు ర్యాలీలో పాల్గొని ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వక్తలు మాట్లాడుతూ.. బ్రిటన్ సభకు ఎంపికైన ఉదయ్ నాగరాజు మూలాలు శనిగరం గ్రామంలో ఉన్నాయని, అతడు చిన్నప్పటి నుంచి చురుగ్గా ఉండేవారని గుర్తుచేశారు.
హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేసి బ్రిటన్ వెళ్ల్లాడని, ఉద్యోగం చేస్తూ లేబర్ పార్టీ తరపున వివిధ స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహిస్తూ అక్కడి ప్రజలకు చేరువయ్యాడని తెలిపారు. లేబర్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసి కొద్ది ఓట్లతో ఓటమిపాలు కాగా, అదే పార్టీ నాగరాజును ఎంపీగా నామినేట్ చేసిందన్నారు. శాశ్వత సభ్యుడిగా ఎంపికైన నాగరాజు మనందరికీ గర్వకారణం అని అన్నారు.
భారతదేశాన్ని పరిపాలించిన సూర్యుడు అస్తమించని రాజ్యాలు కలిగిన బ్రిటన్ పార్లమెంట్‌కు బ్రిటన్ పరిపాలనలో మగ్గిన భారతదేశం నుంచి బ్రిటన్ హౌజ్ ఆఫ్ లాడ్స్ సభ్యుడిగా ఎంపిక కావడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. అనంతరం ఉదయ్ నాగరాజును శాలువాలు,పూల దండలతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తిప్పారపు శ్రీకాంత్, మాజీ జడ్పీటీసీ నాగరాజు శ్యామల, సర్పంచ్ లింగంపల్లి లక్ష్మయ్య, మాజీసర్పంచ్లు కర్ర రవీందర్, కర్రావుల మల్లేశం, కర్ర జయశ్రీ, కాంగ్రెస్ పార్టీ మం డల అధ్యక్షుడు సుధాకర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు పెరుగు నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నాగరాజు వంశీధర్‌రావు, అబ్దుల్ రహీం, కర్ర భిక్షపతి, బత్తిని తిరుపతి, గాజె శ్రీధర్, సంది శ్రీనివాస్‌రెడ్డి, తడ్కల రాజిరెడ్డి, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.