చేగుంట, జనవరి 25: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సహా సరిహద్దు జిల్లాల్లో భూగర్భ జలం కోసం పాతాళం అంచుల్ని చూడాల్సిన పరిస్థితి. ఎన్ని ఫీట్ల లోతు తవ్వాం అని కాకుండా బోరుబావిలో నీళ్లు వచ్చాయా లేదా అన్నదే ముఖ్యం. అంత లోతులోకి బోరుమోటారు దింపాలన్నా, బయటకు తీయాలన్నా రోజుల తరబడి సమయం పడుతోంది. ఖర్చు సైతం తడిసి మోపెడవుతోంది. ఈ వ్యయప్రయాసల నుంచి తప్పించుకునేందుకు చేసిన లోతైన ఆలోచన సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరింపజేసింది. మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన మాలె దత్తు ఆలోచనా పొరల్లో నుంచి పుట్టిన ఆ అధునాతన యంత్రమే ‘ట్రాక్టర్ బోరు మోటారు బిగింపు యంత్రం’.
కాలనుకూలంగా వ్యవసాయ రంగంలో విప్లవాత్మకంగా మార్పులు వస్తున్నాయి. తక్కువ ఖర్చుతో బోరుమోటారు దింపడం, తీయడం అయిపోవాలని మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి గ్రామానికి చెందిన మాలె దత్తు ఆలోచించి కొత్త యంత్రాన్ని తయారుచేయించాడు. ఈ యంత్రంతో ఇప్పుడు బోరు మోటారు దింపడం, తీయడం సులభతరంగా మారింది.
రూ.లక్షా 60 వేలతో తయారీ…
తక్కువ ఖర్చుతో తయారుచేయించిన ఈ బోరు బిగింపు యంత్రం ఎంతో ఉపయుక్తంగా మారింది. తనకు ఉన్న ట్రాక్టర్ ఇంజన్‌కు ఈ యంత్రాన్ని గత ఏడాది క్రితం రూ.1 లక్షా 60 వేల ఖర్చుతో అమర్చాడు.
పనిచేసే విధానం…
ఒకే వ్యకి సహాయంతో వెయ్యి ఫీట్ల వరకు ఉన్న బోరుబావిలోని పైపులను అవలీలగా దించడం, తీయడం చేయవచ్చు. బోరుబావిలో మోటారు చుట్టూ ఇసుక, గులకరాళ్లు ఉండి పైపులు ఇరుక్కొని పోయినా కంప్రెషర్‌తో సులభంగా పైపులను బయటకు తీస్తుంది. ప్రస్తుత రోజుల్లో ఐదు వందల ఫీట్ల లోతులో ఉన్న మోటారు, పైపులను తీయడానికి ఐదుగురు కూలీలు, రెండు రోజుల సమయం అవసరం. కాగా, రూ.7 నుంచి రూ.8 వేల వరకు ఖర్చు అవుతుంది. రెండు గంటల సమయంలోనే 500 వందల ఫీట్ల లోతులోని బోరు మోటార్‌ను రూ.3 వేల ఖర్చుతో ఒకే వ్యక్తి సహాయంతో బయటకు తీస్తుంది.
ఏడాది క్రితం తయారు చేయించా…
ఏడాది క్రితం బోరు మోటారు బిగింపు యంత్రాన్ని తయారు చేయించా. ట్రాక్టర్ ఇంజన్‌కు అమర్చి వినియోగిస్తున్నాం. కొత్తగా వచ్చిన తర్వాత కొద్ది కాలం రైతులకు త్వరగా అవగాహన కలుగలేదు. ప్రస్తుతం ఒకే వ్యక్తి సహాయంతో దీన్ని ఆపరేట్ చేస్తున్నాం. 5 వందల ఫీట్ల లోతు ఉన్న బోరుబావి నుంచి మోటారును రెండు గంటల్లో బయటకు తీయవచ్చు. దీనికి రూ.3 వేలు చార్జీ అవుతుంది.
– మాలె దత్తు, బోరు బిగింపు యంత్రం యాజమాని, శాలిపేట, మెదక్ జిల్లా
ఆధునిక పద్ధతులతో వ్యవసాయ సాగు
రైతులు వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుంది. తద్వారా ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది. ట్రాక్టర్ బోరు మోటారు బిగింపు యంత్రం బావుంది. దీంతో తక్కువ ఖర్చుతో బోరుమోటారు, పైపులు తీసుకోవచ్చు.
– ఎం.యాదగిరి, వ్యవసాయ అధికారి, నార్సింగి మండలం, మెదక్ జిల్లా