చౌటకూర్, అక్టోబరు 18: సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని శివంపేట మంజీరా నది వంతెనపై నుంచి వరదలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన అల్లె లోకచంద్ర మృతదేహం శనివారం లభ్యమైంది. జోగిపేట పట్టణానికి చెందిన అల్లె లోకచంద్ర (31) క్లింకార యూట్యూబ్ ఛానల్‌కు సీఈవోగా పనిచేస్తూ, స్తిరాస్థి వ్యాపారం, లాడ్జీల నిర్వహణ చేస్తున్నాడు. సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న చంద్రాస్ లాడ్జిని అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నాడు. చౌటకూరు మండలంలోని వెండికోలు గ్రామానికి చెందిన సిరిపురం లక్ష్మణ్ సెప్టెంబర్ 28న అదే లాడ్జిలో అనుమానాస్పదంగా మృతిచెందారు. ఈ సంఘటనపై సంగారెడ్డి రూరల్ పోలీసులు లాడ్జి నిర్వహకుడు అల్లె లోకచంద్రను ప్రత్యక్ష సాక్షిగా పేరొంటూ కేసు నమోదు చేశారు. ఇదే కేసు విషయమై పోలీసులు డబ్బులు డిమాండ్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారంటూ లోకచంద్ర తన భార్య ప్రియకు ఆడియో రికార్డును వాట్సాప్ చేసిన అనంతరం సెప్టెంబరు 30న శివంపేట సమీపంలోని మంజీరా నది వంతెనపై నుంచి దూకి గల్లంతయ్యాడు. లోకచంద్ర ఆచూకీ కోసం ఎస్ఆర్డీఎఫ్ రెసూ బృందం, ఎయిర్ బోట్లు, డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టింది.
మత్స్యకారుల కంటపడిన మృతదేహం…
మంజీరా నదిలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు నది ఒడ్డున మృతదేహం కంటపడింది. నదిలో దూకి గల్లంతైన 18 రోజుల తర్వాత ఆచూకీ లభ్యమైంది అప్పటికే, పులల్ ఎస్సై విశ్వజన్ మంజీరా నది తీరం వెంట డ్రోన్ కెమెరాతో గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం నదిలోకి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులకు నది తీర ప్రాంతంలో మట్టిలో కూరుకుపోయిన వ్యక్తి మృతదేహం కనిపించింది. ఈ విషయమై మత్స్యకారులు గ్రామ పెద్దలకు తెలియజేయగా, పులల్ ఎస్సై విశ్వజన్కు సమాచారం అందించారు. ఆయన శనివారం ఉదయం మంజీరా నది తీరానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యులకు తెలియజేశారు. జోగిపేట నుంచి భార్య ప్రియ, ఇతర కుటుంబ సభ్యులు మృతదేహం వద్దకు చేరుకున్నారు. చేతికి ధరించిన కడియం, గడియారం ఆధారంగా మృతుడు అల్లె లోకచంద్రగా గుర్తించారు. మృతదేహానికి అకడే పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం జోగిపేటకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. శివంపేట గ్రామానికి చెందిన బుడోల్ల మల్లేశం జీవితంపై విరక్తి చెంది ఈనెల 8న మంజీరా నది ప్రవాహంలో దూకి గల్లంతయ్యాడు. మల్లేశం గల్లంతై 11 రోజులవుతున్నప్పటికీ ఆచూకీ లభించలేదు.