సంగారెడ్డి జిల్లాను మూడు కార్పొరేషన్ చైర్మన్ పదవులు వరించాయి. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మూడు సార్లు ఎమ్మెల్సీగా హ్యాట్రిక్ సాధించిన వెన్నవరం భూపాల్‌రెడ్డిని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా, అందోల్ నియోజకవర్గం మర్వెల్లికి చెందిన మఠం భిక్షపతిని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా, జహీరాబాద్‌కు చెందిన తన్వీర్ రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కష్టానికి గుర్తింపు లభించిందని, తమకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వర్తిస్తామన్నారు. తమను ఎంపిక చేసిన సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కష్టపడి పనిచేస్తున్న వారిని గుర్తిస్తున్న అధిష్టానం వారికి సముచిత గౌరవం కల్పిస్తున్నదని హర్షం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు స్వీట్లు పంచిపెట్టి, పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.
రామచంద్రాపురం/ అందోల్/ జహీరాబాద్, జూలై 6 : రాష్ట్ర ప్రభుత్వం అనుభవానికి పట్టం కట్టింది. 57 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వెన్నవరం భూపాల్‌రెడ్డిని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా నియమిస్త్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మూడుసార్లు ఎమ్మెల్సీగా భూ పాల్‌రెడ్డి హ్యాట్రిక్ సాధించారు. ఎమ్మెల్సీ పదవీకాలం ముగిసిన తర్వాత సీఎం కేసీఆర్ ఆయన్ను శాసనమండలి ప్రొటెం చైర్మన్ గా నియమించారు. భూపాల్‌రెడ్డి తన రాజకీయ జీవితంలో అజాత శత్రువుగా పేరు తెచ్చుకుని, ఆదర్శంగా నిలిచారు. సీఎం కేసీఆర్‌తో కూడా ప్రత్యేక అనుబంధం ఉంది. పార్టీలకతీతంగా ప్రతిఒక్కరూ భూపాలన్న అంటూ గౌరవిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు ఉన్నది. ఆయన అనుభవాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా నియమించారు. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్త లు, అభిమానులు, బంధుమిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వెన్నవరం భూపాల్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం..
వెన్నవరం భూపాల్‌రెడ్డి 1947 మే1న ఆర్సీపురంలో జన్మించారు. పీయూసీ వరకు చదివిన ఆయన మాజీ ప్రధాని ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకొని 1967లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1969లో పటాన్చెరు గ్రామపంచాయతీ కోఆప్షన్ సభ్యుడిగా, 1975 నుంచి 1978 వరకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 1987లో ఆర్సీపురం ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1996లో పీసీసీ సభ్యుడిగా, 2000లో పీసీసీ కార్యదర్శిగా పనిచేశారు. 2007, 2009లో మెదక్ ఎమ్మెల్సీగా 2015వరకు కొనసాగారు. 2012 నుంచి 2014 వరకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఏర్పాటుతో 2014 జూలై 24న డీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి 25న సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూపాల్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎమ్మెల్సీగా మూడుసార్లు విజయం సాధించి హ్యాట్రిక్‌గా నిలిచారు. 2021 జూన్ 3న శాసనమండలి ప్రొటెం చైర్మన్‌గా పని చేశారు. 2022 జనవరి 4న పదవి ముగిసింది. ఇప్పుడు రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. భూపాల్‌రెడ్డి నియామకంపై అన్నివర్గాల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యకారుడికి దక్కిన గౌరవం: ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా భిక్షపతి
రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా వట్పల్లి మండ లం మర్వెల్లి గ్రామానికి చెందిన మఠం భిక్షపతిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో స్వగ్రామం మర్వెల్లితోపాటు అందోలు నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంచి పెట్టారు. ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, జడ్పీ చైర్పర్సన్ మంజూశ్రీజైపాల్‌రెడ్డి తదితరులు భిక్షపతికి శుభాకాంక్షలు తెలిపారు. జోగిపేటలో పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు చేశారు.
సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మర్వెల్లి గ్రామానికి చెందిన మఠం భిక్షపతి బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో భిక్షపతి కేసులు సైతం ఎదుర్కొన్నారు. ఇటు పార్టీలో అటూ తెలంగాణ జాగృతిలో పనిచేస్తూ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు ముఖ్య అనుచరుడిగా ఎదిగారు. అల్లాదుర్గం మండలం మర్వెల్లి ఎంపీటీసీగా ఎన్నికై వైస్ ఎంపీపీగా పని చేశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్యే క్రాంతికిరణ్ సహకారంతో బీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఉద్యమ నేపథ్యం, కష్టపడే తత్వంతోపాటు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఆశీస్సులతో ఉద్యమకారుడికి సరైన గుర్తింపు దక్కిందని పార్టీ శ్రేణులు, తోటి ఉద్యమ కారులు సంతోషం వ్యక్తం చేశారు.
ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా తన్వీర్
రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మహ్మద్ తన్వీర్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జహీరాబాద్ పట్టణానికి చెందిన తన్వీర్ మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కుమారుడు. తన్వీర్ ప్రస్తుతం మైనార్టీ కమిషన్ సభ్యుడిగా పని చేస్తున్నారు. పదవిలో ఉండగానే సీఎం కేసీఆర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా తన్వీర్‌ను నియమించారు. సీఎం కేసీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు రుణపడి ఉంటానని తన్వీర్ తెలిపారు. తనకు సహకరించిన ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.