హుస్నాబాద్రూరల్/ అక్కన్నపేట, ఏప్రిల్ 24: భూసమస్యల శాశ్వత పరిష్కారానికే సర్కార్ కొత్త భూభారతి ఆర్వోఆర్ చట్టాన్ని తీసుకు వచ్చిందని రాష్ట్ర బీసీ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్), అక్కన్నపేట మండల కేంద్రంలో జరిగిన భూ భారతి చట్టం అవగాహన సదస్సుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. భూభారతి చట్టం పారదర్శకంగా అమలవుతుందని తెలిపారు.
ప్రభుత్వ భూములను కబ్జాలు చేసిన వారిపై పార్టీలకతీతంగా చర్యలు ఉంటాయని తెలిపారు. భూభారతి చట్టంలో భాగంగా గ్రామ రెవెన్యూ అధికారులను, లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించనున్నట్లు చెప్పారు. భూరికార్డుల నిర్వహణను పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. ప్రాజెక్టు పూర్తి చేసి ఈ వానకాలంలో నీళ్లందిస్తామని చెప్పా రు. ఇందుకోసం భూ నిర్వాసితులు సహకరించాలని కోరారు. వారికి ప్రభుత్వ నిబంధనల మేరకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
అంతకుముందు అదనపు కలెక్టర్ హమీద్ భూభారతి చట్టంపై పవర్ ప్రజంటేషన్ ఇచ్చారు. అవగాహన సదస్సు ముగిసిన వెంటనే పలువురు రైతులు పలు భూసమస్యలను మంత్రి, కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి, ఆర్డీవో రామ్మూర్తి, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కేడం లింగమూర్తి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, ఆర్టీఐ సభ్యుడు సూర్యవర్మ, ఏఎంసీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ముత్యాల సంజీవరెడ్డి, బంక చందు, జంగపల్లి అయిలయ్య, రైతులు పాల్గొన్నారు.