కొండపాక(కుకునూరుపల్లి), నవంబర్ 13 : ఎవరు చేసిన పాపమో గానీ..పసికందుకు శాపంగా మారింది. ఆడపిల్ల భారం అనుకున్నారో…మరో కారణమో గానీ అప్పుడే పుట్టిన బిడ్డను ప్లాస్టిక్ కవర్లోమూటగట్టి ఊరు బయట చెట్ల పొదల్లో విసిరేశారు. ఈ సంఘటన బుధవారం కొండపాక మండలం దుద్దెడలోని శివాజీనగర్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. దుద్దెడ గ్రామానికి చెం దిన ఓ యువకుడు గ్రామ శివారులోని ఇండ్ల సమీపంలో మేకలను మేపుతుండగా పసికందు ఏడుపు వినిపించింది. ఆ యువకుడు వెళ్లి చూడగా చెట్ల పొదల్లో కవర్లో కట్టి పడేసిన ఆడ శిశువు కనపడింది. స్థానికులకు సమాచారం ఇవ్వడంతో దుద్దెడ మాజీ సర్పంచ్ ఆరేపల్లి మహాదేవ్ గౌడ్ 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి 108 అంబులెన్స్ టెక్నిషియన్ మహేందర్, పైలెట్ మల్లేశ్ చేరుకొని డాక్టర్ దుర్గాప్రసాద్ సలహాలు, సూచనలు పాటిస్తూ శిశువుకు ప్రథమ చికిత్స అందించడంతోపాటు సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు.