గుమ్మడిదల, మార్చి12 : సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్రస్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాలు ఆదివారం ఉదయం వేదపండితుల వేదమంత్రోచ్ఛరణలతో వైభవంగా ప్రారంభమయ్యాయి. వీరభద్రస్వామి దేవాలయంలో అఖండదీపారాధనతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. దేవాతాహ్వాన, భేరీపూజ, ధ్వజారోహణం, నీరాజనము, మంత్రపుష్పముతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉమ్మడిజిల్లాలోని సుప్రసిద్ధశైవక్షేత్రమైన వీరన్నగూడెం- బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవాలయంలో ఆలయ కార్య నిర్వాహకుడు శశిధర్‌గుప్తా, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు సోమయ్య, రవీంద్ర కుమార్ ఆలయ కమిటీ మాజీ చైర్మన్లు గటాటి భద్రప్ప, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి, సద్ది విజయ భాస్కర్‌రెడ్డి, నాగేందర్‌గౌడ్, ఎంపీపీ సద్దిప్రవీణారెడ్డి, జడ్పీటీసీ కుమార్ గౌడ్, జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభయ్యాయి. ఈసందర్భంగా అఖండదీపారాధన చేశారు.
గణపతి హోమంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో వేదపండితులు మంత్రోచ్ఛరణలతో స్వామివారికి, అమ్మవారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భద్రకాళీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి పట్టు వస్ర్తాలను సమర్పించారు. ఈనెల 12వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. 16న అగ్నిగుండాలు, 17న స్వామి వారి కల్యాణోత్సవం, 18న స్వామి వారు పురవీధుల మీదుగా విమాన రథోత్సవంలో భక్తులకు దర్శనమియ్యనున్నారు.
ఈబ్రహ్మోత్సవాలకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాలతో పాటు ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవాలను తిలకించనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, మడపతి గణేశ్, పొన్నబోయిన వేణు, సర్పంచ్‌లు ఆలేటి నవీనాశ్రీనివాస్‌రెడ్డి, మాజీ ధర్మకర్తలు లక్ష్మీనారాయణ, నాయకులు గటాటి రమేశ్, వినోద్ గౌడ్, ఉప సర్పంచ్ కుమార్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.