హుస్నాబాద్, జూన్ 1: గోల్కొండ ఆస్థాన కవిగా, రాజయోగిగా ప్రఖ్యాతిగాంచిన సిద్ధప్ప వరకవి సాహిత్యం స్ఫూర్తితోనే అందెశ్రీ రచనలు ఉంటాయని ప్రముఖ కవి, రచయిత, సిద్ధప్ప వరకవి కుమారుడు అనంతవరం మాణిక్యలింగం తెలిపారు. సిద్ధప్ప వరకవి సాహిత్యం కోసం పలుమార్లు అందెశ్రీ గుండారెడ్డిపల్లికి వచ్చి ఆయన అనుభవాలను, రచనలను తనతో పంచుకున్నట్లు చెప్పారు. అందెశ్రీ సాహితీవేత్తగా, కవిగా ఎదగానికి సిద్ధప్ప వరకవి రాసిన పద్యాలు, రచనలు కారణమని చెప్పేవారన్నారు. చిన్నతనంలో పశువుల కాపరిగా ఉన్న సమయంలో సిద్ధప్ప రాసిన జ్ఞానబోధినిలోని పద్యాలను, పంక్తులను, అక్షరాల కూర్పును చదివి అదే పంథాలో అందెశ్రీ కూడా పద్యాలు రాశారని తెలిపారు.
తన సాహిత్యానికి, రచనలకు సిద్ధప్ప వరకవియే స్ఫూర్తి అని ఇటీవల టీవీ చానళ్లు, పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లోనూ ఆయన స్వయంగా చెప్పారన్నారు. తన తండ్రి సిద్ధప్ప వరకవి స్ఫూర్తితో కవిగా, రచయితగా ఎదిగిన అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతం రాష్ట్ర గీతంగా ఎంపిక కావడం హర్షణీయమన్నారు. ఆయన మరిన్ని రచనలు చేసి జాతీయ స్థాయిలోనూ గుర్తింపును తెచ్చుకోవాలని కోరుకుంటున్నట్లు మాణిక్యలింగం తెలిపారు. ఈ పాట తెలంగాణ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు.