తూప్రాన్, ఫిబ్రవరి 7: గతేడాది శిక్షణ విమానం కూలిపోయి చనిపోయిన కుమారుడి సమాధి వద్దకు వందల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి ఓ తల్లి నివాళులర్పించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీకి చెందిన శిక్షణ విమానం (పీసీ 7 ఎంకే) సాంకేతిక లోపంతో తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని రావెళ్లి శివారులో గుట్టల మధ్య గతేడాది డిసెంబర్ 4న కుప్పకూలి దగ్ధమైంది. ఈ దుర్ఘటనలో పైలెట్ అభిమన్యు రాయ్‌తోపాటు శిక్షణ పొందుతున్న వూవ్యాన్ తైన్ అనే వ్యక్తి సజీవ దహనమయ్యారు. మృతదేహాలు గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అధికారులు అక్కడికి చేరుకుని కుటుంబసభ్యులకు సమాచారమిచ్చి, దర్యాప్తు చేపట్టారు. పైలెట్ అభిమన్యు రాయ్ తన తల్లిదండ్రులకు ఏకైక కుమారుడు.
కుమారుడి మీద ఉన్న ప్రేమతో డెహ్రాడూన్ నుంచి తూప్రాన్ చేరుకున్న అభిమన్యురాయ్ తల్లి శిక్షణ విమానం కూలిన చోటే స్మృతివనాన్ని నిర్మించేందుకు సహకరించాలని అధికారులను కోరగా అంగీకరించారు. దీంతో అభిమన్యురాయ్కు గుర్తుగా అతడు మృతిచెందిన ప్రాంతంలోనే సమాధిని నిర్మించింది. ఫిబ్రవరి 7న అభిమన్యురాయ్ పుట్టినరోజు కావడంతో తల్లి చిత్రలేఖరాయ్ ఉత్తరాఖండ్ నుంచి తూప్రాన్ చేరుకుని నివాళులర్పించింది. అక్కడ స్మృతివనాన్ని నిర్మిస్తానని, అప్పుడే తన కుమారుడి ఆత్మకు శాంతి లభిస్తుందని ఆమె పేర్కొంది.