రామాయంపేట/ హవేళీఘనపూర్/ మెదక్ రూరల్/ చిలిపి చెడ్, డిసెంబర్ 21 : ప్రభుత్వం నిర్దశించిన ‘తొలిమెట్టు’ లక్ష్యా లను సాధించడం విద్యార్థులకు కీలకమని, పిల్లల్లో అభ్యాస నాన్ని మెరుగుపర్చే విధంగా ఉపాధ్యాయులు సరళమైన భాష లో విద్యా బోధన చేయాలనిజిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్‌కుమార్, సెక్టోరల్ అధికారి సుభాష్ పేర్కొన్నారు. బుధవారం రామాయంపేట మండలం తొనిగండ్లలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. తొలిమెట్టులో భాగంగా విద్యార్థులతో బ్లాక్‌బోర్డుపై రాయించడం, చదివించడం చేయించారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు కచ్చితంగా సమయ పాలన పాటించాలని, సమయపాలన పాటిస్తేనే విద్యార్థులు కూడా ప్రార్థన వేళల్లో సమయానికి పాఠశాలకు వస్తారన్నారు. ప్రభుత్వం విద్యార్థుల చదువు కోసం అన్ని రకాల చర్యలను చేపడుందన్నారు. ఆడిన ప్రశ్నలకు విద్యార్థులు జవాబు లు చెప్పడంతో విద్యాధికారి సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులను చదవడం, రాయడంపై అభ్యాసనం చేయించాలని ఉపాధ్యాయులకు సూచించారు. డీఈవో వెంట తొనిగండ్ల పాఠశాల ఉపాధ్యాయులు రాజయ్య, సుధాకర్ ఉన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ‘తొలిమెట్టు’ విజయవంతంగా నిర్వహించాలని డీఈవో రమేశ్‌కుమార్ అన్నారు. మెదక్ మండలం లోని పాతూర్, హవేళీఘనపూర్ మండలంలోని శమ్నాపూర్ పాఠశాలలను తనిఖీ చేశారు. విద్యార్థులతో చదివించి, వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగి, సమాధానాలు తెలుసుకున్నారు. డీఈవో వెంట సెక్టోరియల్ అధికారి సుభాశ్ ఉన్నారు.
చిలిపిచెడ్ మండలంలోని జగ్గంపేట, కొత్తకుంట తండా పాఠశాలలను నోడల్ అధికారి విఠల్ సందర్శించారు. విద్యార్థులకు మౌలిక భాషా, గణిత సామర్థ్యాల సాధన ‘తొలిమెట్టు’ లక్ష్యాలను ఉపాధ్యాయులు సాధించాలని సూచించారు. ఆయ న వెంట ఉపాధ్యాయుడు సత్యనారాయణ ఉన్నారు.
రామాయంపేట, డిసెంబర్ 21 : గణితంలో మెలకువలను వివరిస్తూ వేగాన్ని, ఖచ్చితత్వాన్ని మిళితం చేస్త్తూ విద్యార్థులకు విద్యాబోధన చేస్తే గణితంలో ముందుకు వెళ్తారని గణితశాస్త్ర బోధకుడు సురేందర్ పేర్కొన్నారు. రామాయంపేట మండలం రాయిలాపూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గణితంపై ప్రత్యేక బోధన నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో గణితం ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. గణితశాస్త్ర దినోత్స వం సందర్భంగా విద్యార్థులకు డాక్టర్ రామానుజమ్ మేజిక్ సంఖ్యలను వివరించారు. మనిషి దైనందిన జీవితం గణితం ముడిపడి ఉందన్నారు. ప్రాథమిక స్థాయి నుంచి విద్యార్థులకు వినూత్న బోధనా పద్ధతులతో గణితాన్ని బోధించాలన్నారు.