వట్పల్లి, ఏప్రిల్ 4: సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలంలోని దేవునూర్ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో 8వ తరగతి విద్యార్థి మిస్సింగ్ అయిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వసతి గృహంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నిర్లక్ష్యంతోనే విద్యార్థి మిస్సింగ్ అయినట్లు విద్యార్థి తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. హాస్టల్లో 8వ తరగతి చదువుతున్న ఎం.కుమార్ మార్చి 21 నుంచి హాస్టల్లో కనబడడం లేదని తెలిసింది.
ఈ విషయం తెలిసినా హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంతో వ్యవహరించారని, విద్యార్థి తల్లిదండ్రులకు ఏప్రిల్ 2న సమాచారం అందించి కొంత నగదు ఇచ్చి ఆచూకీ కనుక్కోవాలని వార్డెన్ చెప్పినట్లు తెలిసింది. దీంతో భయాందోళనకు గురైన విద్యార్థి తల్లిదండ్రులు బంధువులతో కలిసి వట్పల్లి పోలీస్ స్టేషన్లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. సీఐ అనిల్‌కుమార్ హాస్టల్‌కు చేరుకుని తల్లిదండ్రులు, హాస్టల్ వార్డెన్, వాచ్‌మెన్‌తో మాట్లాడి వివరాలు సేకరించారు. విద్యార్థి మిస్సింగ్‌పై విచారణ చేపతామని సీఐ తెలిపారు. కాగా, విద్యార్థి మిస్సింగ్ విషయం తెలిసి శుక్రవారం హాస్టల్ ఎదుట విద్యార్థి కుటుంబీకులు, బంధువులు బైఠాయించి ఆందోళన చేపట్టారు.